Mobile Popup Ad
Mobile Popup Ad

సింగరేణిలో రాజకీయ జోక్యం.. కార్మిక సమస్యలకు అడ్డంకి : ఏఐటీయూసీ

కలం, ఖమ్మం బ్యూరో : సింగరేణి (singareni) సంస్థలో కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యం ప్రధాన అడ్డంకిగా మారిందని ఏఐటీయూసీ (AITUC) తీవ్రంగా ఆరోపించింది. కొత్తగూడెంలోని (Kothagudem) శేషగిరిభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి మాట్లాడుతూ, యాజమాన్యంతో జరిగిన చర్చలలో అంగీకరించిన డిమాండ్‌లను సైతం ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించని పక్షంలో నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ బోర్డు కేసులు, అలియాస్ పేర్ల మార్పు, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను తొలగింపు, సొంత ఇంటి స్థలాల కేటాయింపు వంటి సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు నియామక ఉత్తర్వులు జారీ చేయడంలో ఆలస్యం జరుగుతోందని, దీనివల్ల వందలాది మంది అభ్యర్థులు వేతనాలు కోల్పోతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఇక మరోవైపు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను పెంచాలని ఒత్తిడి తెస్తూనే, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.56 వేల కోట్ల బకాయిలను విడుదల చేయకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఈ నిధుల కొరత కారణంగా సంస్థ ఆధునీకరణ, కొత్త పెట్టుబడులు నిలిచిపోయాయని తెలిపారు. అలాగే కొత్త కోల్ బ్లాకుల కేటాయింపుపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల భవిష్యత్ తరాలకు ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి భవిష్యత్తు, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టబోయే పోరాటానికి అన్ని కార్మిక, ప్రజాసంఘాలు మద్దతు పలకాలని ఏఐటీయూసీ నేతలు పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>