కలం, కరీంనగర్: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) రాష్ట్ర అధ్యక్షుడిగా (AISF State President) కరీంనగర్‌కు చెందిన కసిరెడ్డి మణికంఠ రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు హన్మకొండలో నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాల్లో భాగంగా జరిగిన రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
మణికంఠ రెడ్డి 2011లో ఏఐఎస్ఎఫ్‌లో చేరారు. అనంతరం కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, నగర కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శిగా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2022లో కొత్తగూడెంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల్లో తొలిసారి రాష్ట్ర అధ్యక్షుడిగా (Kasireddy Manikanta Reddy)ఎన్నికయ్యారు. తాజాగా హన్మకొండలో జరిగిన 90వ వార్షికోత్సవాల్లో మరోసారి అదే బాధ్యతను చేపట్టారు.
విద్యారంగంలోని సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న మణికంఠ రెడ్డికి మరోసారి రాష్ట్ర అధ్యక్ష (AISF State President) బాధ్యతలు అప్పగించడంపై ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నూనావత్ శ్రీనివాస్ నాయక్, మచ్చ రమేష్‌తో పాటు పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాలపై విద్యార్థుల తరఫున పోరాటాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. విద్యార్థులు, యువతను రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తూ వారి సంక్షేమాన్ని విస్మరించే విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
Also Read : కాంగ్రెస్ అభ్యర్థులుగా ‘రెడ్డి’లకే ఛాన్స్.. స్పందించిన మల్లు రవి
Follow Us On: X(Twitter)

