పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయొద్దు.. ఏఐఎస్ఎఫ్ ఫైర్

​కలం, ఖమ్మం బ్యూరో: పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడటం తగదని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్ ధ్వజమెత్తారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేయడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట మంగళవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ విద్యా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. స్కిల్ వర్సిటీ ముసుగులో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల ఆస్తులను ప్రైవేటీకరించడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ఈసెట్ రాసే అర్హత కోల్పోయి, బీటెక్ లాటరల్ ఎంట్రీకి దూరమై కార్పొరేట్ కంపెనీల్లో తక్కువ వేతనాలకే పనిచేసే పరిస్థితులు దాపురిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

​డిప్లొమా విద్యార్థులకు ఎంతో కాలంగా అమల్లో ఉన్న లాటరల్ ఎంట్రీ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యా రంగాన్ని దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పాలిటెక్నిక్ కమిటీ సభ్యులు సలిగంటి జయదీప్, రామ్ చరణ్, సాయి రామ్, వడ్డేబోయిన యశ్వంత్, ముదిగొండ నిరీక్షణ, సన్నీ, స్నేహిత్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>