సెమీకండక్టర్ రంగంలో భారీ అవకాశాలు: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్: విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటూ, అందుబాటులోకి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ (Nirmal Collector) భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అన్నారు. మంగళవారం బాసర ఐఐఐటీలోని సమావేశ మందిరంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) హైదరాబాద్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న సెమీకండక్టర్ డిజైన్‌పై ఐదు రోజుల ప్రత్యేక వర్క్‌షాప్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో సెమీకండక్టర్ తయారీ, డిజైనింగ్ రంగాలకు భారీగా డిమాండ్ ఉందని, భవిష్యత్తులో ఈ రంగాలు మరింత కీలకంగా మారనున్నాయని తెలిపారు. ఐఐఐటీ విద్యార్థులకు ఇలాంటి ప్రత్యేక శిక్షణ అందించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు.

విద్యార్థులు తమ కోర్ సబ్జెక్టులపై పట్టు సాధించడంతో పాటు సాంకేతిక అంశాలపై ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యా బోధన కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులలో ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించేలా ఉండాలని సూచించారు. విద్యార్థులు అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు అన్ని వనరులను సమకూరుస్తున్నామని భవేశ్ మిశ్రా తెలిపారు. విద్య పూర్తికాకముందే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందేలా తగిన అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. బయట ప్రపంచంలో ఉన్న వివిధ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిలో స్ఫూర్తిని నింపారు.

ఏదైనా అంశంపై సందేహాలు ఉంటే అధ్యాపకులను అడిగి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి, క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దానిపై పూర్తి పట్టు సాధించగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, వర్సిటీ ఉపకులపతి గోవర్ధన్, ఎన్ఐఈఎల్ఐటీ హైదరాబాద్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మణ్ కోర్ర, ఓఎస్డీ మురళీ దర్శన్, ఐడెక్స్ మాజీ డైరెక్టర్ కల్నల్ (రిటైర్డ్) ఎ.కె. సింగ్, వీర టాక్టికల్ డైనమిక్స్ సీఈఓ సాయి తేజ, క్యూక్లైర్వాయన్స్ క్వాంటం ల్యాబ్స్ వీపీ సేల్స్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>