కలం, కరీంనగర్: హైదరాబాద్లో మహిళల నుంచి అండాలను అక్రమంగా సేకరించి, రవాణా చేసిన వ్యవహారంలో డాక్టర్ పద్మజపై కేసు నమోదైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా అధికారులు తక్షణమే అప్రమత్తం కావాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ (Bandari Shekhar) డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. జిల్లాలో నిర్వహిస్తున్న అన్ని ఐవీఎఫ్ కేంద్రాలపై ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక దాడులు, సమగ్ర తనిఖీలు నిర్వహించాలని కోరారు.
రికార్డులు తారుమారయ్యే ప్రమాదం
హైదరాబాద్ ఘటన వెలుగులోకి రావడంతో కరీంనగర్లోని ఐవీఎఫ్ కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తమై, అక్రమంగా సంపాదించిన డబ్బులు, దాతల సమ్మతి పత్రాలు, వైద్య రికార్డులు, అండాల నిల్వ, రవాణా వివరాలను ఇప్పటికే దాచిపెట్టే ప్రయత్నాలు చేసి ఉంటారని బండారి శేఖర్ ఆరోపించారు. ఆలస్యం చేయకుండా అధికారులు రంగంలోకి దిగి ల్యాబ్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ, డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీలను చట్టబద్ధంగా భద్రపరిచి లోతైన విచారణ జరపాలని స్పష్టం చేశారు.
క్రిమినల్ కేసులు, లైసెన్సుల రద్దుకు డిమాండ్
సంతానలేమితో బాధపడుతున్న దంపతుల ఆశలను ఆసరాగా చేసుకుని లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ, చికిత్సలో వాడే అండాల మూలం, దాతల వివరాలపై తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు అక్రమార్కుల వల్ల నిజాయితీగా సేవలందిస్తున్న వైద్యుల ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, డీఎంహెచ్వో, సంబంధిత ఏఆర్టీ నియంత్రణ అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టాలని కోరారు. అక్రమాలు తేలితే ఆయా కేంద్రాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతో పాటు బాధ్యులైన వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, నేషనల్ మెడికల్ కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

