కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు (Tamil Nadu ) రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌ను కోరారు. ఈ మేరకు బల నిరూపణకు అవకాశం కోరుతూ టీటీవీ దినకరన్ గవర్నర్ కు లేఖను సమర్పించారు. ఎమ్మెల్యేలను కొనడానికి టీవీకే ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించాలన్నారు. ఈ విషయం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఏఎంఎంకే అన్నాడీఎంకే కూటమిలో భాగంగా ఉంది. తాము విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. అన్నాడీఎంకేకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా తమ పార్టీ నుంచి గెలుపొందిన కామరాజ్ కూడా లేఖపై సంతకం చేశారని వెల్లడించారు. కాగా, రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుందని సీపీఎం నేత బాలకృష్ణన్ కూడా ప్రకటించారు. దీనిపై లోక్‌భవన్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌కు లేఖ అందడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

