కలం, ఆదిలాబాద్: భీంపూర్(Bheempur) పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (Akhil Mahajan) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి, వారి సమస్యలను సత్వరం పరిష్కరించాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పోలీసులపై నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
గ్రామాల్లో నిరంతరం పర్యటిస్తూ గంజాయి, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు. చట్టవ్యతిరేక, సంఘ వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో జైనథ్ సీఐ జి. శ్రావణ్, భీంపూర్ ఎస్సై పీర్ సింగ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

