కలం, వనపర్తి జిల్లా: రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం ప్రారంభించిన “వన మహోత్సవం” కార్యక్రమ లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్ (Kheemya Naik) అన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం కొత్తకోట మండలం ఖానాయపల్లి, అమడబాకుల గ్రామపంచాయతీలలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పాఠశాలలు, నర్సరీలను సందర్శించిన అదనపు కలెక్టర్ (Kheemya Naik), పాఠశాలల్లో రికార్డులు, హాజరు పట్టికలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభ్యాసం, పాఠశాల పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. పాఠశాలల నిర్వహణ తీరును సమీక్షించి విద్యార్థుల హాజరు శాతాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
అదనంగా నర్సరీలో పెంచుతున్న మొక్కల సంరక్షణ, నిర్వహణపై వివరాలు తెలుసుకుని, మొక్కలను నాణ్యతతో పెంచాలని సూచించారు. వన మహోత్సవం (Vana Mahotsavam) లక్ష్యాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ ఉమాదేవి, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: తల్లి కాబోతున్న సమంత.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!
Follow Us On: Sharechat

