కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత విద్యను ప్రధానంగా బోధించాలని, తద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) ఆదేశించారు. బుధవారం శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యా కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్‌మెంట్), ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు, ఏఐ తరగతుల నిర్వహణ, అపార్ (APAAR) ఐడీల నమోదు, కొత్తగా చేరిన విద్యార్థుల యూడైస్ (UDISE) వివరాల నమోదు వంటి అంశాలపై ఆరా తీశారు. విద్యార్థుల సంఖ్య పెంపునకు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించిన కలెక్టర్, ఏఐ తరగతులను క్రమబద్ధమైన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి తన సొంత ఐడీ ద్వారా శిక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.
నాణ్యమైన ఆహారాన్ని అందించాలి..
అనంతరం శ్రీరంగాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)ను సందర్శించి వంటశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. అనంతరం స్టాక్ రూమ్ సందర్శించి మెస్ కమిటీ నిర్వహణ కొనసాగుతుందా.. లేదా? అని ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్లు మెస్ కమిటీ విద్యార్థుల సంతకాల నమోదు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం, వసతుల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
పదో తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ (Collector Adarsh Surabhi), గత విద్యా సంవత్సరంలో సీనియర్స్ సాధించిన 100 శాతం ఉత్తీర్ణతను స్పూర్తిగా తీసుకొని, ఈ ఏడాది కూడా విద్యార్థులు 100% ఉత్తీర్ణులు అయ్యేలా లక్ష్యంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. పాఠ్యపుస్తకాల పంపిణీని పూర్తిచేయడంతోపాటు కంప్యూటర్ తరగతులను విద్యార్థులు సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం శ్రీరంగాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్.. గ్రామ సర్పంచ్‌తో గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై చర్చించి వివరాలు తెలుసుకున్నారు.
చెలిమిల్లలో పాఠశాల తనిఖీ
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని చెలిమిల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అసంపూర్తిగా ఉన్న అదనపు పాఠశాల భవనాన్ని పరిశీలించారు. భవనం వినియోగంలోకి రావడానికి అవసరమైన పనులపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటుక పనులు (బ్రిక్ వర్క్) పూర్తి చేసి భవనాన్ని త్వరగా వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జెడ్పి సీఈవో యాదయ్య, శ్రీరంగాపూర్ సర్పంచ్ మద్దిలేటి, ఇతర మండల అధికారులు తదితరులు కలెక్టర్ ఉన్నారు.
Read Also: ఎరుపెక్కిన ఆకాశం.. మరో విలయానికి సంకేతమా?
Follow Us On : WhatsApp

