కలం, వెబ్ డెస్క్ : సినీ నటి ప్రత్యూష మృతి కేసు (Pratyusha)లో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 24 ఏండ్ల తర్వాత ఈ తీర్పు రావడం గమనార్హం. సిద్దార్థ రెడ్డి (Siddharth Reddy) వేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. నాలుగు వారాల్లోపు పోలీసులకు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
సినీ నటి ప్రత్యూష మృతి (Pratyusha) అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో అనేక చర్చలకు దారితీసింది. ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. తల్లి సరోజినీ దేవికి ఉన్న అనుమానంతో సుదీర్ఘ న్యాయపోరాటమే జరిగింది. నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 24 న మృతిచెందారు. ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి పురుగుల మందు తాగి మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతిచెందగా ప్రియుడు సిద్ధార్థ రెడ్డి కోలుకున్నారు. తొలుత ఇది ఆత్మహత్యాయత్నమంటూ ప్రచారం జరిగినా అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోస్టుమార్టం నివేదికలో ఆమె మెడ ఎముక విరిగిందని, శరీరంపై కొన్ని గాయాలు ఉన్నాయని తేలడం ఈ అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. దీని వెనుక రాజకీయ నాయకుల కుమారులు ఉన్నారనే పుకార్లు అప్పట్లో బలంగా వినిపించాయి.
ప్రత్యూష ఆత్మహత్య చేసుకుని చనిపోలేదని, హత్య అని తల్లి సరోజినిదేవి వాదించారు. మృతి ఘటనపై పోలీసులు ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసినా ప్రజాసంఘాల ఒత్తిడితో పాటు తల్లి ఆరోపణలతో కోర్టుల్లో విచారణ జరిగింది. ప్రియుడు సిద్ధార్ధను పెళ్లి చేసుకోవాలని భావించినా పెద్దలు అంగీకరించలేదనే కారణంతో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సిటీ సివిల్ కోర్టు 2004లో సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఆ శిక్ష రెండేళ్లకు తగ్గింది. శిక్ష తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శిక్షను పూర్తిగా కొట్టివేయాలంటూ సిద్ధార్థ రెడ్డి కూడా సుప్రీంకోర్టును కోరారు. ఈ కేసును పరిశీలించిన తర్వాత ఐదేళ్ల శిక్షను రెండేండ్లకు తగ్గించేలా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సిద్ధార్థ రెడ్డి లొంగిపోయి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. దీనితో ఈ సుదీర్ఘ న్యాయపోరాటం ఒక కొలిక్కి వచ్చింది. తాజాగా జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్‌మోహన్‌లతో కూడిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించడం గమనార్హం.
Read Also: హాట్ టాపిక్: కుర్చీకోసం కుమ్మక్కు రాజకీయాలు
Follow Us On : WhatsApp


