కలం, నాగర్‌కర్నూల్: గత బీఆర్ఎస్ పాలనలోనే పలు ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే (Achampet MLA) డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచి, ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని అన్నారు.
పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు సంబంధించిన పనులు, అనుమతులు, పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం అధికారికంగా వివరాలు వెల్లడిస్తోందని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ విమర్శలు చేయడం కాకుండా, గతంలో ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు మాట్లాడే ధైర్యం కేటీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ బీసీ గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునేద్ర కుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వంకేశ్వరం నిరంజన్, అచ్చంపేట మార్కెట్ చైర్మన్ గోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, రంగాపూర్ దర్గా చైర్మన్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

