రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో ఎన్నో బాగోతాలు: ఎంపీ చామల

కలం, భువనగిరి: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ పూర్తిగా అక్రమ నిర్మాణమమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఆరోపించారు. అజీజ్ నగర్ ప్రాంతంలోని రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా అసైన్డ్ ల్యాండ్‌లో ఉందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని జీవో నెం.111ని పూర్తిగా ఉల్లంఘించి ఫాం హౌస్ కట్టుకున్నారని విమర్శించారు. ఈ ఫాంహౌస్ కేంద్రంగా ఎన్నో బాగోతాలు జరిగాయని.. అనేక అక్రమ వ్యవహారాలకు కేంద్రంగా ఉండేదని వివరించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ఇక్కడే బీజం పడిందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ‘ఈగల్ టీమ్’ ఏర్పాటు చేస్తే, రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌లో రేవ్, డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తూ పోలీసులకు దొరికారని ఎంపీ చామల గుర్తు చేశారు. ఆ దాడిలో 11 మందిలో ఏడుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని, పోలీసులపై కాల్పులు కూడా జరిగాయని ఆరోపించారు. రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు చెందిన కేదార్ అనే వ్యక్తికి రూ.25 లక్షలు ఎందుకు చెల్లించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

డ్రగ్స్ పార్టీలకు అడ్డాలుగా..

గత బీఆర్ఎస్ పాలకులు ఫాం హౌస్ సంస్కృతిని పెంచి పోషించి, వాటిని అక్రమాలకు, డ్రగ్స్, రేవ్ పార్టీలకు అడ్డాగా మార్చుకున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా ఫామ్‌హౌస్‌ల అక్రమాలపై ‘ఫామ్‌హౌస్ ఫైల్స్’ పేరుతో నిజాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. ‘రంగనాయక సాగర్ నుంచి ప్రారంభించి ఎర్రవెల్లి, జన్వాడ, అజీజ్ నగర్ వరకు జరిగిన అక్రమ ఫాం హౌస్‌ల లీలలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు.

కేటీఆర్ నాటకాలు..

ఒకరోజు ఆగర్భ శ్రీమంతులమని, మరోరోజు హైదరాబాద్‌లో ఉండేందుకు ఇల్లు కూడా లేదని కేటీఆర్ నాటకాలాడుతున్నారని ఎంపీ చామల ఎద్దేవా చేశారు. కేటీఆర్ నార్సింగిలో ఉంటున్నానని చెప్తూ, సత్యం రామలింగరాజు కంపెనీ భూముల్లో ఫాం హౌస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. జన్వాడ ఫాం హౌస్‌ను ప్రదీప్ రెడ్డి పేరు మీద రాయించి, ఆ పరిసరాల్లోని భూములను భార్య, అత్త కుటుంబ సభ్యుల పేర్లపై మార్చుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాం హౌస్‌పై ఈగల్ ఫోర్స్ దాడి చేసినప్పుడు అసలు నిజాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. అమెరికాలో చదువుకుని వచ్చిన కేటీఆర్ తెలంగాణకు నేర్పిన సంస్కృతి ఇదేనా అని ప్రశ్నించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>