జనగామ కోర్టులో కలకలం.. అటెండర్‌పై నిందితుడి దాడి

కలం, జనగామ: జనగామ జిల్లా కోర్టు (Jangaon District Court) ప్రాంగణంలో గురువారం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న కోర్టు అటెండర్‌పై ఓ నిందితుడు విచక్షణారహితంగా దాడికి తెగబడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. వివ‌రాల్లోకి వెళ్తే.. కోర్టు అటెండర్‌గా పని చేస్తున్న కుసా సంపత్ గురువారం తన విధుల్లో భాగంగా జడ్జి చాంబర్ వద్ద ఉన్నారు. ఉదయం 10:30 గంటల సమయంలో జడ్జి చాంబర్‌కు వస్తుండటంతో, అక్కడ ఉన్న రద్దీని సంపత్ క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి కేసులో విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన ప్రణయ్ అనే వ్యక్తి, ఒక్కసారిగా సంపత్‌పైకి దూసుకొచ్చి దాడికి పాల్పడ్డాడు.

పోలీసుల అదుపులో నిందితుడు:

ఈ హఠాత్పరిణామంతో కోర్టు సిబ్బంది, లాయర్లు షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఇతర సిబ్బంది నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ దాడిలో అటెండర్ సంపత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ప్రణయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు, కోర్టు ప్రాంగణంలోనే దాడికి పాల్పడినందుకు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>