భారత మహిళల క్రికెట్‌లో దిగ్గజ కెప్టెన్‌గా పేరొందిన మిథాలి రాజ్(Mithali Raj)కు అరుదైన గౌరవం లభించింది. క్రికెట్‌లో ఎందరో రాణించినా కొందరికి మాత్రమే దక్కే గౌరవం ఇది. అదే ఒక క్రికెట్ స్టేడియంలో వారి పేరుపై ప్రత్యేక స్టాండ్ ఏర్పాటు చేయడం. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అజారుద్దీన్ పేరుపై ఒక స్టాండ్ ఉంది. అయితే ఇప్పుడు విశాఖలోని స్టేడియంలో(Vizag Stadium) ఒక స్టాండ్‌కు మిథాలి రాజ్ పేరు పెట్టాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ రావి కల్పన(Ravi Kalpana) పేరును ఒక ప్రవేశ ద్వారానికి పెట్టబోతున్నారు. ఈ సందర్భంగానే ఒకస్టాండ్‌కు మిథాలి(Mithali Raj) పేరును పెట్టనున్నట్లు ఏసీఏ ప్రకటించింది. ఈ నెల 12న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా వీరిని ఏసీఏ ఈ విధంగా గౌరవించనుంది.
విశాఖకు చేరుకున్న టీమిండియా..
ప్రపంచకప్‌లో భాగంగా విశాఖ స్టేడియంలో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. వాటిలో ఒకటి ఈ నెల 9న దక్షిణాఫ్రికాతో జరగనుంది. ఆ మ్యాచ్ కోసం భారత మహిళల జట్టు సోమవారమే విశాఖకు చేరుకుంది. కొలంబో నుంచి ప్రత్యేక విమానంలో వారు వచ్చారు. ఈ నెల 9న ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో తలపడనున్నారు. ఈ నెల 12న ఆస్ట్రేలియాతో పోరు జరగనుంది.

