కలం, నిర్మల్ : నిర్మల్(Nirmal) జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల సమస్యలపై ఏబీవీపీ(ABVP) ఆధ్వర్యంలో వినతి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలలో(Govt Schools) కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్నకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశిందర్ మాట్లాడుతూ, స్కూళ్లను మూసివేయాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం అత్యవసరమని తెలిపారు. ఇక ఖాళీగా ఉన్న డీఈఓ, ఎంఈఓ పోస్టులతో పాటు టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సొంత భవనాలు లేక అద్దె భవనాలలో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు ప్రత్యేకంగా కొత్త భవనాలు నిర్మించాలని సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో సంపూర్ణమైన మధ్యాహ్న భోజనం అందించాలని కోరారు. అదేవిధంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలలో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని, పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత సీట్ల నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ముడపల్లి దినేష్‌తో పాటు బోయిడి ఆకాష్, నితీష్, వంశీ, కార్తీక్, రాము, నైతిక, పవన్, అభి, సురేష్, రమేష్, రాజ్ కుమార్, రాజేష్, పరమేష్, అభిరామ్, హరీష్, దినేష్, హిరేష్, దివార్ తదితరులు పాల్గొన్నారు.

