కలం, నిజామాబాద్ బ్యూరో: నిషేధిత 22(ఏ) భూములకు సంబంధించిన అంశాలలో ప్రభుత్వ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలని అధికారులను కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. సమగ్ర ఆధారాలు, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే సహేతుక నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. నిజామాబాద్ (Nizamabad) కలెక్టరేట్ లో బుధవారం జేసీ భుజంగరావుతో కలిసి 22ఏ నిషేధిత భూముల జాబితాపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
వివరాలు తెలుసుకున్న కలెక్టర్..
22ఏ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తున్న ఫిర్యాదులు, భూముల రికార్డుల పరిశీలన, జాబితాలో చేర్చడం, తొలగింపు ప్రక్రియ తదితర అంశాలపై ఒక్కో మండలం వారీగా తహసీల్దార్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా ప్రైవేట్ భూమి పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో నమోదైనట్లు నిర్ధారణ అయితే, సర్వే నంబర్ వారీగా డిలీటెడ్ లిస్ట్ రూపొందించి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. 22ఏ జాబితాలో భూములను చేర్చే సమయంలో అనుసరించే విధానాన్నే తొలగింపు ప్రక్రియలోనూ విధిగా పాటించాలని తెలిపారు.
రిమార్క్స్ తప్పనిసరిగా నమోదు చేయాలి..
తొలగించే ప్రతి సర్వే నంబర్‌కు స్పష్టమైన కారణాలు, నిర్దిష్ట రిమార్క్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 22ఏ సమస్యలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలని హితవు పలికారు. నిషేధిత భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అధికారులు సమన్వయంతో పనిచేసి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని, సమగ్ర వివరాలతో నిర్ణీత ఫార్మాట్ లో నివేదికను రూపొందించి వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత, నిజామాబాద్, బోధన్ ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి, ట్రైనీ ఆర్డీఓ సందీప్, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

