కలం, వెబ్ డెస్క్ : ఆధార్-పాన్ (Aadhaar PAN) కార్డ్‌ను లింక్ చేయాలని ప్రభుత్వం ఎంతో కాలంగా చెబుతూ వస్తుంది. లింక్ చేయకపోతే చాలా తిప్పలు తప్పవని అధికారులు అంటున్నారు. దీనికి ఆఖరుగా 2025 డిసెంబర్ 31ని ఆఖరు డేట్‌గా ప్రకటించింది. డిసెంబర్ 31లోపు పాన్‌కు ఆధార్ లింక్ చేయకపోతే జనవరి 1 నుంచి పాన్ పనిచేయదు. అలా అయితే ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం కొత్త బ్యాంక్ ఖాతాలు, డీమ్యాట్ ఖాతాలు తెరవడం, ట్యాక్స్ రిఫండ్ పొందడం సాధ్యం కాదు. అయితే మంచి విషయం ఏంటంటే రూ.1000 జరిమానా చెల్లించి పాన్‌ను మళ్లీ యాక్టివ్ చేసుకునే అవకాశం ఉంది.
పాన్ పనిచేయకుండా పోతే రోజువారీ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. డెబిట్ కార్డు (DEBIT CARD), క్రెడిట్ కార్డు (CREDIT CARD) దరఖాస్తులు నిలిచిపోవచ్చు. బ్యాంకులు పోస్టాఫీసుల్లో నగదు జమ చేయడం, డిమాండ్ డ్రాఫ్ట్, పేమెంట్ ఆర్డర్లు తీసుకోవడం కూడా పరిమితం అవుతుంది. నిర్ణీత పరిమితికి మించిన నగదు లావాదేవీలు తిరస్కరించే అవకాశం ఉంటుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తు సబ్సిడీలు బ్యాంక్ ఖాతా ప్రారంభం వంటి ప్రభుత్వ సేవల్లోనూ ఆటంకాలు ఎదురవుతాయి. పాన్ కార్డు పోయినా దెబ్బతిన్నా కొత్త కార్డు పొందడం కూడా కష్టమే. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గడువు దాటినా పాన్‌ను తిరిగి యాక్టివ్ చేయవచ్చు. ముందుగా ఆధార్ లింకింగ్ పూర్తి చేయాలి. తరువాత రూ.1000 జరిమానా చెల్లించాలి. చెల్లింపు పూర్తయిన కొద్ది రోజుల్లోనే పాన్ మళ్లీ యాక్టివ్ అవుతుంది. గడువు దాటిన తర్వాత కూడా ఈ ఫీజు తప్పనిసరి కావడం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక విషయం స్పష్టం పాన్ రియాక్టివేషన్‌కు ప్రత్యేకంగా అదనపు గడువు లేదు. ఎంత ఆలస్యం చేస్తే అంత కాలం ఆర్థిక లావాదేవీలు అధికారిక పనులు నిలిచిపోతాయి. అందుకే వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయడం మంచిది.
పాన్-ఆధార్ లింక్ చేసే విధానం చాలా సులువు. ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మై ప్రొఫైల్ విభాగంలో లింక్ ఆధార్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. అక్కడ పాన్, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. జరిమానా వర్తిస్తే ఈ పే ట్యాక్స్ ఆప్షన్‌లో ఇతర రిసీప్ట్స్ కింద రూ.1000 కనిపిస్తుంది. బ్యాంక్ పోర్టల్ ద్వారా చెల్లింపు చేసి లింకింగ్ అభ్యర్థన సమర్పించాలి.పాన్ యాక్టివ్ అయ్యే వరకు లావాదేవీలు విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. నిబంధనలను పాటించడంలో సమస్యలు వస్తాయి సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఆధార్‌తో పాన్ లింక్ చేయడం వల్ల ఈ అన్ని అడ్డంకులు తొలగిపోతాయి గుర్తింపు దుర్వినియోగం నకిలీ సమస్యలు తగ్గుతాయి. అందుకే గడువు మిస్ చేసినవారు ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


