కలం, వెబ్ డెస్క్ : బ్యాంకులు పోలీసులకు సహకరిస్తే సైబర్ నేరాలకు చెక్ పెట్టొచ్చని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ (Cp Sajjanar) అన్నారు. సైబర్ నేరాలను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో హైదరాబాద్ ఆఫీస్ లో సజ్జనార్ (Cp Sajjanar) నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం స్పెషల్ గా భేటీ అయింది. సైబర్ నేరగాళ్లకు అతిపెద్ద అస్త్రంగా మారిన ‘మ్యూల్ ఖాతాల’ విధానంలో ఆర్బీఐ కఠినమైన రూల్స్ అమలు చేయాలని సజ్జానార్ ఆర్బీఐ గవర్నర్ కు సూచించారు. చాలా మంది సైబర్ నేరగాళ్లు పేద విద్యార్థులు, కూలీలకు రూ.2వేలు, రూ.5వేలు ఇచ్చి ఈ మ్యూల్ ఖాతాలను ఓపెన్ చేయిస్తున్నట్టు మల్హోత్రా దృష్టికి తీసుకెళ్లారు.
సైబర్ నేరాల ద్వారా దోచుకున్న డబ్బులను ఈ మ్యూల్ ఖాతాలకు క్షణాల్లోనే పంపిస్తున్నట్టు సీపీ తెలిపారు. కాబట్టి ఈ ఖాతాలను ఈజీగా గుర్తించేందుకు ‘సెంట్రలైజ్డ్ డేటాబేస్’ ఏర్పాటు చేయాలన్నారు. ఈ మ్యూట్ ఖాతాలను ఓపెన్ చేసే ముందు లైవ్ వీడియో కేవైసీతో పాటు జియో వెరిఫికేషన్ లాంటివి చేస్తే అర్హులే ఈ ఖాతాలను తీసుకుంటున్నారా లేదంటే ఏదైనా క్రైమ్ జరుగుతోందా అనేది తెలుసుకోవచ్చన్నారు సజ్జనార్. ఇక స్టేట్ మెంట్లు కూడా అన్ని బ్యాంకులు ఒకే విధంగా ఇస్తే నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. పోలీసులు సైబర్ కేసులను విచారించడంలో ఈ స్టేట్ మెంట్లే కీలకంగా ఉంటాయని.. డబ్బు పంపిన, రిసీవ్ చేసుకున్న కస్టమర్ల వివరాలు క్లియర్ గా ఉండేలా ఆర్బీఐ ఆర్డర్స్ ఇవ్వాలని సంజయ్ మల్హోత్రాను సీపీ సజ్జనార్ కోరారు.
‘నిరుద్యోగ యువకులకు ఆన్ లైన్ జాబ్స్, పార్ట్ టైమ్ జాబ్స్, మల్టీ లెవల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ లాంటి చైన్ సిస్టమ్ స్కామ్ లు చాలా ప్రమాదంగా మారాయి. ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకునేలా సీబీఐ, ఈడీ అధికారులతో ఆర్బీఐ కలిసి పనిచేయాలి. వీటి వల్ల లక్షల మంది నష్టపోతున్నారు’ అంటూ ఆర్బీఐ గవర్నర్ కు సజ్జనార్ వివరించారు. సజ్జనార్ సూచనల ప్రకారం సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు సంజయ్ మల్హోత్రా. ఈ భేటీలో అడిషనల్ సీపీ(క్రైమ్స్) ఎం.శ్రీనివాసులు, ఐపీఎస్, సీసీఎస్ డీసీపీ శ్వేత, సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు మరికొందరు అధికారలు ఉన్నారు.


