కలం వెబ్ డెస్క్ : పేదింటి ఆడపిల్లల ఉన్నత చదువు(Education)ల కోసం మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఏకంగా తన ఇంటిని తాకట్టు(house mortgaged) పెట్టి గొప్ప మనసు చాటుకున్నారు. సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ ప్రాంతానికి మమత అనే విద్యార్థిని వైద్య విద్య పూర్తి చేసి పీజీ చేసేందుకు ప్రవేశ పరీక్ష రాసింది. పీజీలో సీటు రావడంతో ఎంతో సంతోషపడింది. కానీ, ట్యూషన్ ఫీజు కింద ఏటా రూ.7.50 లక్షలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం చెప్పింది. ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉండటంతో మమత తీవ్ర నిరాశకు గురైంది.
బ్యాంకులో లోన్ తీసుకుందామని వెళ్లగా ఏదైనా ఆస్తిని తాకట్టు పెడితే లోన్ ఇస్తామని అధికారులు చెప్పారు. మమత తండ్రి రామచంద్రం టైలర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కూతురు చదువు ఆగిపోతుందన్న భయంతో విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థిని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు సిద్ధిపేట(Siddipet)లోని తన ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.20 లక్షల రుణం ఇప్పించారు. అంతే కాకుండా మమత హాస్టల్ ఫీజు కోసం రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు.
రామచంద్రంకు నలుగురు కుమార్తెలుండగా అందరూ వైద్య విద్య చదువుతున్నారు. రామచంద్రం, తన భార్య శారద ఎంతో కష్టపడి పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. గతంలోనూ తమ కూతుర్లు మెడికల్ కాలేజీల్లో సీటు సాధించినప్పుడు రామచంద్రం ఆర్థిక సాయం కోసం హరీష్ రావును సంప్రదించారు. ఇద్దరు కూతుర్లకు హాస్టల్ ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చి హరీష్ రావు ఇప్పటికీ సాయం అందిస్తున్నారు. ఒకే ఇంటిలో ఇంతమంది ఆడపిల్లల చదువులకు సహాయం అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న హరీష్ రావు దాతృత్వంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.


