కలం వెబ్ డెస్క్ : బీజేపీ ఉపాధి హక్కును దెబ్బ తీసేందుకు బీజేపీ(BJP) కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ కొత్తగా తీసుకొచ్చిన బిల్లుపై హరీష్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇది కేవలం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం(MGNREGA) పేరు మార్చడం మాత్రమే కాదని, ఇది భారతదేశ సమాఖ్య వ్యవస్థపై నేరుగా జరిగిన దాడి అని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 60:40 నిధుల నిష్పత్తి అనే ముసుగులో, రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారాన్ని మోపి, ఉపాధి హామీ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తోందన్నారు.
ఈ బిల్లు రాష్ట్రాల అధికారాలను కత్తిరించి, కేంద్ర నియంత్రణను బలోపేతం చేయడానికే రూపొందించారని హరీష్ రావు చెప్పారు. 60:40 నిష్పత్తిపై కాంగ్రెస్(Congress) పార్టీ మౌనంగా ఉండటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రతిపక్షంలో ఉండి సమాఖ్యవాదాన్ని గొప్పగా చెప్పుకుంటూనే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలను బలహీనపరిచే బీజేపీ చర్యలకు నిశ్శబ్దంగా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అధికార కేంద్రీకరణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకేవైపు ఉంటాయన్న విషయాన్ని ఈ బిల్లు స్పష్టం చేస్తోందన్నారు. ఈ బిల్లుతో ప్రజల ఉపాధి హక్కు, రాష్ట్రాల స్వయంప్రతిపత్తి ఒకేసారి దెబ్బతింటున్నాయని, ఇది సంస్కరణ కాదని, సమాఖ్యవాదంపై దాడి అని పేర్కొన్నారు.


