కలం, వెబ్‌డెస్క్: పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు (Nallamala Sagar Project) విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన కేంద్ర అనుమతులు సాధించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. ఈ భేటీలో మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు అనుమతుల విషయమై చర్చించినట్టు సమాచారం.
వ్యతిరేకిస్తున్న తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు (Nallamala Sagar Project) పై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గే ఆలోచనలో లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అంతర్రాష్ట్ర జల వివాదంగా మారిన ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా మరింత వేడిని పెంచుతోంది. గతంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి బనకచర్లను పక్కన పెట్టిన ఏపీ ప్రభుత్వం పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కూడా తెలంగాణకు నష్టం చేకూర్చేదనని సాగునీటిరంగ నిపుణులు, తెలంగాణ వాదులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్రంతో ఏపీ చర్చలు
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, సాంకేతిక అంశాలు, అంతర్‌రాష్ట్ర ప్రభావాలపై కేంద్రంతో చర్చలు జరిపినట్లు సమాచారం. కేంద్ర స్థాయిలో మద్దతు పొందడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు, ఏపీ ఈ అంశంలో దూకుడుగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. న్యాయపరమైన పోరాటంతో పాటు కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేయనున్నదా? అన్నది వేచి చూడాలి.
కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ !
ఏపీతో జలవివాదాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. త్వరలో కేసీఆర్ జలవివాదాలపై పోరాటం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. మరోసారి తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్‌ను రగిలించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి వ్యూహాన్ని అవలంభించబోతున్నది అన్నది వేచి చూడాలి.
Read Also: ప్రభాకర్‌రావు కస్టడీ 25 వరకు కంటిన్యూ
Follow Us On : WhatsApp


