కలం, వెబ్ డెస్క్ : ప్రతిపక్షంలో ఉన్నవాళ్లకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదు అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలను సాధించిందని తెలిపారు. సర్పంచ్ ఎలక్షన్ల (Sarpanch Elections) ఫలితాలపై సీఎం గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు. 12,702 స్థానాల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబెల్స్ 66శాతం స్థానాల్లో గెలిస్తే.. 33 శాతం బీజేపీ, బీఆర్ఎస్ ఫలితాలు సాధించాయన్నారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పాలనకు ఇచ్చిన తీర్పు అని తెలిపారు.
కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని గుర్తు చేశారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటిందని చెప్పారు. రెండేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరించారని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలను మెప్పించాయన్నారు. ‘గెలిస్తే పొంగిపోవడం, ఓడిస్తే కుంగిపోవడం మా నైజం కాదు. భవిష్యత్తులో ఇంకా బలంగా పని చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ (Assembly Eelctions) ఇదే తరహా ఫలితాలు వస్తాయి’ అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ..
94 శాసనసభ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 87 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ అత్యధిక ఫలితాలు సాధించిందని సీఎం వివరించారు. బీఆర్ఎస్ 6 నియోజవర్గాల్లో , బీజేపీ ఒక నియోజకవర్గంలో అత్యధిక ఫలితాలు సాధించాయన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛను అందించి.. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించామని చెప్పారు. హోదాలను అడ్డుపెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేసేలా తాము నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
2029లోనూ ఇవే ఫలితాలు వస్తాయి..
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు. ఈ ఫలితాలు చూసే అద్భుతం అని కొందరు జబ్బలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2029 లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని, 2/3 మెజారిటీతో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
గోదావరి, కృష్ణా జలాలపై ద్రోహం నిరూపిస్తాం..
కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉండగానే ఆయన్ను ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. కృష్ణా జలాలపై లేఖ రాయాలని, ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధం అని సీఎం సవాల్ విసిరారు. ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. గోదావరి, కృష్ణా జలాలపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే పదేళ్లలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్, కేసీఆర్ తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు. గోదావరి, కృష్ణా జలాలపై వారు చేసిన ద్రోహం ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రజాస్వామ్య బద్ధంగా అసెంబ్లీలో చర్చ చేసి ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు.
Read Also: కబ్జాదారులు, రౌడీలను దూరంగా పెట్టాం : తుమ్మల
Follow Us On: Pinterest


