ఆఖరి వరల్డ్ కప్‌కు సన్ హ్యుంగ్ మిన్.. కొరియా జట్టులో టెన్షన్!

కలం, వెబ్ డెస్క్: వరల్డ్ కప్‌కు ముందు సౌత్ కొరియా జట్టును ఆందోళన వెంటాడుతోంది. కెప్టెన్ సన్ హ్యుంగ్ మిన్‌కు ఇది చివరి వరల్డ్ కప్ కావొచ్చనే చర్చల మధ్య.. అతని ఫామ్, జట్టు ప్రదర్శన అభిమానుల్లో టెన్షన్ పెంచుతున్నాయి. 33 ఏళ్ల సన్ ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. టోటెన్‌హామ్‌ను విడిచి ఎల్‌ఏఎఫ్‌సీకి వెళ్లిన తర్వాత అతని ఆటతీరుపై విమర్శలు పెరిగాయి. అయితే తాను ఫామ్ కోల్పోలేదని సన్ స్పష్టం చేశాడు. జాతీయ జట్టును వీడే సమయం వస్తే.. తనే స్వయంగా నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు.

ఇటీవల వార్మప్ మ్యాచ్‌ల్లో కొరియా వరుస షాకులు ఎదుర్కొంది. ఐవరీ కోస్ట్ చేతిలో 4-0, ఆస్ట్రియా చేతిలో 1-0తో ఓడిపోవడం అభిమానుల అసంతృప్తిని మరింత పెంచింది. ఈ ఒత్తిడిలో కోచ్ హాంగ్ మ్యూంగ్ బో కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. 2014 వరల్డ్ కప్‌లో ఆయన కోచింగ్‌లోనే కొరియా ఒక్క విజయం లేకుండానే వెనుదిరిగింది. రెండేళ్ల క్రితం ఆయనను మళ్లీ కోచ్‌గా తీసుకురావడంపైనా విమర్శలు వచ్చాయి.

అయితే కోచ్ హాంగ్ మాత్రం సన్‌కు అండగా నిలిచారు. సన్ జట్టుకు కీలక ఆటగాడని, అతనిపై తనకు ఎలాంటి సందేహం లేదని చెప్పారు. కొత్త వ్యూహాల కోసం ఫార్మేషన్ మార్పులు చేస్తున్నామని, పెద్ద టోర్నీలో ఒక్క ప్లాన్‌తో సరిపోదని వివరించారు. గ్రూప్-ఎలో ఉన్న సౌత్ కొరియా జూన్ 11న చెక్ రిపబ్లిక్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. అదే గ్రూప్‌లో మెక్సికో, సౌత్ ఆఫ్రికా కూడా ఉన్నాయి.

దేశం తరఫున 143 మ్యాచ్‌ల్లో 54 గోల్స్ చేసిన సన్.. గత 15 ఏళ్లుగా కొరియా ఫుట్‌బాల్‌కు ప్రధాన బలంగా ఉన్నాడు. 2022 వరల్డ్ కప్‌లో కంటి గాయంతో మాస్క్ ధరించి ఆడిన అతడు.. ఈసారి మాత్రం బలమైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. కిమ్ మిన్ జే, లీ కాంగ్ ఇన్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా.. వరల్డ్ కప్‌లో కొరియా భవితవ్యం చాలా వరకు సన్ ఫామ్‌పైనే ఆధారపడినట్టు కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>