కలం, వెబ్ డెస్క్: ఏపీలోని తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత సంచారం ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరా తీశారు. చిరుతను సురక్షితంగా పట్టుకునేందుకు తక్షణ చర్యలకు ఆదేశించారు. ప్రస్తుతం చిరుత ఎక్కడ ఉంది? పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో రాజమండ్రిలో నుంచి ఫోన్ లో సమీక్షించారు. ప్రస్తుతం చిరుత వినియోగంలో లేని గదిలో నక్కి ఉందని.. సిబ్బంది ఇప్పటికే ఆ ప్రదేశానికి చేరుకున్నట్టు అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు.
నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా అప్రమత్తంగా వ్యవహరించాలని, చిరుతకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకుని తిరిగి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని సూచించారు. తక్షణమే జూ సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు. రెస్కూ సందర్భంగా విద్యార్థులు, విశ్వ విద్యాలయం సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. చిరుత సంచారంపై ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని భరోసా కల్పించారు.

