45 తులాల బంగారం రిక‌వ‌రీ చేసిన అమీన్ పూర్ పోలీసులు

కలం, మెదక్ బ్యూరో : సైబరాబాద్ కమిషనరేట్ అమీన్‌పూర్ (Ameenpur) పోలీస్ స్టేషన్ పరిధిలోని బందం కొమ్ము ప్రాంతంలోని హిల్ టాప్ కాలనీలో ఏప్రిల్ 14న జరిగిన బంగారు దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. కుటుంబం ఊరికి వెళ్లిన సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి 45 తులాల బంగారు నగలు దొంగతనం చేసిన నిందితుడిని నెల రోజుల్లోనే అరెస్టు చేసి, దొంగలించిన మొత్తం బంగారాన్ని ఇవాళ బాధితులకు అప్పగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రపురం వ్యాపారవేత్త వెంకటరమణ కుటుంబం ఏప్రిల్ 14న ఊరికి వెళ్లిన సమయంలో దొంగలు రాడ్ సాయంతో ఇంటి తాళం పగులగొట్టి దాదాపు 45 తులాల బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన వెంకటరమణ తన భార్య భవానీతో కలిసి అమీన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మే 16న మండ్ల శివ (32) అనే నిందితుడిని అరెస్టు చేశారు. ఈ వ్యక్తి పై మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో 12, సైబరాబాద్‌లో 3, నాగర్‌కర్నూల్ జిల్లాలో 9 కేసులు సహా మొత్తం 24 కేసులు నమోదు ఉన్నట్లు తెలిసింది.

ఈ రోజు రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ నేతృత్వంలో మీడియా సమక్షంలో దొంగలించిన 45 తులాల బంగారు నగలను వెంకటరమణ-భవానీ దంపతులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ, ఇంటి పరిసరాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని, ఊర్లకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అమీన్‌పూర్ ఇన్‌స్పెక్టర్ పి. నరేశ్, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ జి. సత్యనారాయణ, వారి బృందం ఈ కేసును వేగంగా పరిష్కరించడంపై వెంకటరమణ-భవానీ దంపతులు తమ కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>