Mobile Popup Ad
Mobile Popup Ad

త్వరలో ఇండియా, ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్‌ : మోదీ

కలం, వెబ్ డెస్క్: ఇండియా, ఇటలీ మధ్య సంబంధాలు అత్యంత సన్నిహితంగా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ (Modi) అన్నారు. రక్షణ, ఇన్నోవేషన్ రంగాల్లో ఇటలీతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. త్వరలో ఇండియా–ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. టెర్రర్ ఫైనాన్సింగ్‌పై రెండు దేశాల ఉమ్మడి పోరు.. ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా చివరగా ఇటలీ చేరుకున్న నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీతో బుధవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరు దేశాల సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచేందుకు, వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు నేతలు అంగీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాయింట్ ప్రెస్‌మీట్‌లో మోదీ మాట్లాడారు.

‘‘రోమ్‌ను ప్రపంచంలో ఎటర్నల్ సిటీ (శాశ్వత నగరం) అని పిలుస్తారు. ఇండియాలో నా లోక్‌సభ నియోజకవర్గమైన కాశీని కూడా అలాగే అంటారు. ఇలాంటి రెండు గొప్ప నాగరికతలు కలిసినప్పుడు, చర్చలు కేవలం అజెండాకే పరిమితం కావు. అందులో చరిత్ర లోతు, భవిష్యత్తు చిత్రం, స్నేహం కనిపిస్తాయి” అని మోదీ భావోద్వేగంగా మాట్లాడారు.

దౌత్యంతో సమస్య పరిష్కరించుకోవాలి

ఇండియా, ఇటలీ సముద్ర తీర శక్తులని, కనెక్టివిటీ విషయంలో సన్నిహిత సహకారం చాలా అవసరమని మోదీ అన్నారు. షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పని చేస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధాల గురించి మాట్లాడుతూ… అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలనే భారతదేశ స్థిరమైన వైఖరిని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ‘భారత్-యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌పై ఇటలీ అందిస్తున్న సహకారానికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం 800 కంటే ఎక్కువ ఇటాలియన్ కంపెనీలు భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు. అలాగే, ఇటలీలో యోగా, ఆయుర్వేదం, భారతీయ వంటకాలపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోందని, ఇది ఇరు దేశాల ప్రజల మధ్య బంధాన్ని బలపరుస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.

చారిత్రాత్మకం దినం: మెలోని

భారత్-ఇటలీ సంబంధాలలో ఒక చారిత్రాత్మక దినంగా మెలోనీ అభివర్ణించారు. 2014లో మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టాక ఇటలీలో ఆయన చేసిన మొదటి అధికారిక ద్వైపాక్షిక పర్యటన ఇదేనని ఆమె గుర్తు చేశారు. చివరిసారిగా 2000లో ఇండియా ప్రధాని ఇటలీ పర్యటనకు వచ్చారని, దాదాపు 26 ఏళ్ల తర్వాత మోదీ ఇక్కడికి వచ్చారని చెప్పారు. ఇరు దేశాల మధ్య బంధం ఎన్నడూ లేనంత అత్యున్నత స్థాయికి చేరుకుందని మెలోని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>