కలం, కరీంనగర్ బ్యూరో: మంది మాటలు విని సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తే పైసల్ పాయె.. ఓటమి మూటకట్టుకొని పరువు పోయె అని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన సర్పంచ్ అభ్యర్థులు(Defeated Sarpanch Candidates) మనోవేదనకు గురి అవుతున్నారు. రెండేళ్లుగా సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడు పోటీ చేద్దామా అని ఎదురుచూసి తీరా ఎన్నికల్లో పోటీ చేశాక ఓడిపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఓట్ల కోసం ఖర్చు చేసిన డబ్బు, ఓడిన తర్వాత పోయిన పరువు తలచుకొని మనసులోనే బాధపడుతున్నారు.
లక్షల రూపాయల ఖర్చు..:
రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇందులో కొందరు ఇష్టంగా బరిలో నిలువగా, మరి కొందరు మంది మాటలు నమ్మి గెలుస్తామనే ధీమాతో పోటీకి దిగారు. గెలుపే లక్ష్యంగా స్తోమతకు మించి ఖర్చు చేశారు. వాస్తవానికి సర్పంచ్ అభ్యర్థి కేవలం రూ.30వేలు మాత్రమే ఖర్చు చేయాలని నిబంధన ఉంది. అయినప్పటికీ ఎవరూ ఎన్నికల సంఘం నిబంధనలు పట్టించుకోలేదు. ఓట్లు రాబట్టుకోవడానికి విచ్చలవిడిగా లక్షల రూపాయలు ఖర్చు చేశారు. మద్యం పంచారు. ఒకో గ్రామంలో ఓటుకు రూ.500 నుంచి రూ. 2వేల వరకు చెల్లించారు. పోటీలో ఎంత మంది అభ్యర్థులున్నా గెలిచేది ఒక్కరే. ఆ ఒక్కరూ తామే కావాలన్న ఆశతో భారీగా ఖర్చుపెట్టారు. అయినా, చివరికి ఓటమి చెందడంతో అభ్యర్థులు(Defeated Sarpanch Candidates) మనోవేదనకు గురి అవుతున్నారు. అందిన కాడికి అప్పులు తెచ్చి, ఓట్ల జూదంలో పొగోట్టుకొని ఆందోళన చెందుతున్నారు. చేసిన అప్పులు తీర్చేది ఎలా..? ఉన్న ఊళ్లో పోయిన పరువు తిరిగి పొందడం ఎలా? అని దిగులుపడుతున్నారు.
గెలిచినా కనిపించని సంబురం..
గెలిచిన అభ్యర్థుల్లోనూ చాలా మంది పైకి సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నా లోలోపల ఆందోళన చెందుతున్నారు. అనుకున్న దానికి కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు కావడంతో, ఐదేళ్లలో సర్పంచ్ పదవితో సంపాదించేది ఎంత? ఖర్చు చేసింది ఎంత? అనే ఆలోచనలో పడ్డారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థుల గెలుపు, ఓటముల ముచ్చట్లే వినిపిస్తున్నాయి.
Read Also: డ్రోన్ ద్వారా తక్కువ ఖర్చుతో వరి సాగు : కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Follow Us On: X(Twitter)


