కలం, వెబ్డెస్క్: సిడ్నీలో లైసెన్స్ ఉన్న ఒక్యో వ్యక్తి దగ్గర వందల గన్స్ ఉన్నట్లు వెల్లడైన ప్రభుత్వ రిపోర్టు షాక్కు గురిచేస్తోంది. మూడు రోజుల కిందట ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం సమీపంలో ఉన్న బాండీ బీచ్ (bondi beach firing) లో తండ్రీకుమారులు తుపాకులతో కాల్పులకు తెగబడడంతో 16 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. హనుక్కా వేడుకలు జరుపుకుంటున్న యూదు జాతీయులు లక్ష్యంగా సాజిద్, అతని కుమారుడు నవీద్ ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఈ ఉదంతం ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోక ముందే సిడ్నీలో గన్ లైసెన్స్ ఉన్న ఒక్కో వ్యక్తి దగ్గర సగటున 300 గన్స్ ఉన్నాయని వెల్లడవడం కలకలం రేపుతోంది. ఒక్కో లైసెన్స్ మీద వేర్వేరు తుపాకులు తీసుకున్నట్లు ఆ రిపోర్టులో తేలింది. కాగా, ఫైర్ఆర్మ్స్ రిజిస్ట్రీ డేటా ప్రకారం దేశంలో గన్ లైసెన్స్ ఉన్నవాళ్లలో 41శాతం మంది సిడ్నీ, న్యూక్యాజిల్, వోల్లాంగ్ సిటీల్లో ఉన్నారు. ఆస్ట్రేలియన్ గన్ సేఫ్టీ సంఘం లెక్కల ప్రకారం.. దాదాపు 5లక్షల మంది వద్ద అక్రమంగా తుపాకులు ఉన్నాయి. గన్ కల్చర్ వల్ల అమెరికాలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు లాంటివి ఆస్ట్రేలియాలోనూ మొదలుకావొచ్చనే ఆందోళనలు ప్రస్తుతం స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.


