కలం, వెబ్ డెస్క్ : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై(Defected MLAs) వేటు అంశంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెల్లడించారు. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌లోకి ఫిరాయింపు చర్యలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పీకర్ తేల్చిచెప్పారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, అందువల్ల వారిపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేయాలంటూ స్పీకర్ కార్యాలయానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చారు. పిటిషన్ల తరపున వాదించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి న్యాయవాదుల వాదనలతో స్పీకర్ కార్యాలయం ఏకీభవించలేదు. పార్టీ ఫిరాయించారని పేర్కొంటున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం కుదరదని స్పీకర్ స్పష్టం చేశారు.
మొత్తం పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defected MLAs)పై బీఆర్ఎస్ నుంచి ఫిర్యాదులు రాగా అందులో ఐదుగురిపై విచారణను పూర్తి చేసిన స్పీకర్ కార్యాలయం ఐదుగురికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది.ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, తెల్లం వెంకటరావు, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌లపై అనర్హత వేటు వేయడం కుదరదని స్పీకర్ స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణను రానున్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇంకో ఐదుగురి ఎమ్మెల్యేలపై (కడియం శ్రీహరి, దానం నాగేందర్, డాక్టర్ సంజయ్, కాలె యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి) అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉన్నది.
Read Also: మొదలైన టీ20 ప్రపంచకప్ టూర్.. రామసేతుపై అద్భుత దృశ్యం!
Follow Us On: Instagram


