Mobile Popup Ad
Mobile Popup Ad

న్యాయం కోసం వచ్చిన మహిళపై సీఐ దారుణం.. కేసు నమోదు!

​కలం, ఖమ్మం బ్యూరో: శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) స్థాయి అధికారి, న్యాయం కోసం వచ్చిన ఒక అబల పట్ల కీచకుడిగా మారిన ఉదంతం ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. కష్టాల్లో ఉన్న మహిళలకు అండగా నిలవాల్సిన అధికారియే.. బాధితురాలిని తన కామవాంఛకు బలితీసుకోవడం ఖాకీ విభాగానికి మచ్చగా మారింది. ప్రేమ పేరుతో వలవేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, చివరకు గర్భవతిని చేసి ముఖం చాటేసిన ఖమ్మం సీఐ (Khammam CI) రాజు నాయక్ (Raju Nayak) లీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

​బాధితురాలి కథనం ప్రకారం.. 2023లో తన భర్త పెడుతున్న వేధింపులను తట్టుకోలేక సదరు వివాహిత న్యాయం కోసం ఖమ్మం మహిళ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆ సమయంలో అక్కడ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు రాజు నాయక్. బాధితురాలి కష్టాలను తీర్చాల్సిన ఆ అధికారి ఫిర్యాదు కాపీలో ఉన్న ఆమె ఫోన్ నంబర్‌ను తీసుకుని, న్యాయం చేస్తాననే నెపంతో తరచూ ఫోన్లు చేయడం ప్రారంభించాడు. ​బాధల్లో ఉన్న ఆ వివాహితకు మాయమాటలు చెబుతూ, త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో అసలు రంగు బయటపడింది. గర్భవతి కావడంతో సదరు వివాహిత తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని సీఐ రాజు నాయక్ పై ఒత్తిడి తెచ్చింది. అయితే, అప్పటివరకు ప్రేమ వలకబోసిన సీఐ (Khammam CI).. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి రోజుకో నెపంతో జాప్యం చేస్తూ కాలయాపన చేస్తూ వచ్చాడు. తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన బాధితురాలు, చివరకు న్యాయం కోసం ఉన్నతాధికారులను ఆశ్రయించక తప్పలేదు. ఈ నెల 7వ తేదీన ఆమె పోలీస్ ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ చీకటి బాగోతం వెలుగులోకి వచ్చింది.

​బాధితురాలి ఫిర్యాదుతో కదిలిన పోలీస్ యంత్రాంగం అంతర్గత విచారణకు ఆదేశించింది. ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో సీఐ రాజు నాయక్ బాధితురాలిని వేధించినట్లు, మోసం చేసినట్లు ఆధారాలతో సహా నిజాలు నిరూపణ అయినట్లు తెలుస్తోంది. విషయం తీవ్రమవడంతో సీఐ రాజు నాయక్ పై కేసు నమోదు చేశారు. కాగా, విషయం లీక్ అయినప్పటి నుండి సీఐ రాజు నాయక్ అందుబాటులో లేకుండా పోయారు. ​ఈ నేపథ్యంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగా రాజు నాయక్ ను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. బాధితురాలికి పూర్తి న్యాయం జరగాలని, సదరు అధికారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read Also: తెలంగాణలో కాంగ్రెస్ – బీజేపీ పొలిటికల్ బిజినెస్ : మన్నె క్రిశాంక్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>