కలం డెస్క్: టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) అనారోగ్యానికి గురయ్యారు. గ్యాస్ట్రోఎంటెరైటిస్ (పొట్ట, పేగుల వాపు) కారణం అతడు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. డిసెంబర్ 16న యావత్ దేశం ఐపీఎల్ మినీ వేలం హడావుడితో బిజీగా ఉన్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడుతున్న జైస్వాల్, సూపర్ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ముంబై విజయం సాధించిన కొన్ని గంటలకే అస్వస్థతకు గురయ్యారు. ఆ మ్యాచ్‌లో ఆయన 16 బంతుల్లో 15 పరుగులు చేశారు.
మ్యాచ్ అనంతరం జైస్వాల్‌కు తీవ్రమైన కడుపు నొప్పి మొదలై క్రమంగా పెరగడంతో వెంటనే పింప్రి–చించ్‌వాడ్‌లోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి తీవ్ర గ్యాస్ట్రోఎంటెరైటిస్‌గా నిర్ధారించారు. చికిత్సలో భాగంగా ఐవీ (ఇంట్రావీనస్) మందులు అందించడంతో పాటు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ పరీక్షలు కూడా చేశారు. ప్రస్తుతం జైస్వాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. వైద్యులు కొన్ని రోజులు మందులు కొనసాగించాలని, పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన కోలుకున్న తర్వాతే మళ్లీ మైదానంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జైస్వాల్(Yashasvi Jaiswal) ఆరోగ్యంపై అభిమానులు, క్రికెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాయి.
Read Also: ఫుట్‌బాల్ క్లబ్‌కు షాక్.. ఎంబెప్పేకు నష్టపరిహారం
Follow Us On: Youtube


