కలం డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన త్వరలో మంత్రివర్గ (Telangana Cabinet) సమావేశానికి సచివాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామీణ స్థానిక సంస్థల (Local Bodies) ఎన్నికలు (సర్పంచ్, వార్డు సభ్యుల పోస్టులకు) ఎన్నికల ప్రక్రియ డిసెంబరు 17తో పూర్తికానున్నందున ఇకపైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ (ZPTC, MPTC) ఎన్నికల నిర్వహణ గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశమున్నది. దీనికి తోడు అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించడం, మూడు ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టి చట్టాలుగా మార్చుకోవడం తదితర అంశాలపైనా చర్చ జరగవచ్చని సమాచారం. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ సక్సెస్, రెండేండ్ల పాలనలో అమలు చేసిన పథకాలు, సాధంచిన ప్రగతి తదితరాను అసెంబ్లీ వేదికగా వెల్లడించడంపైనా మంత్రుల అభిప్రాయాలను కోరే అవకాశమున్నది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ :
సర్పంచ్, వార్డుల సభ్యుల పోస్టులకు ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగిసినందున ఇకపైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల భర్తీ కోసం ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సైతం దాదాపు పావు వంతుకు పైగా గెలుచుకోవడంపై పీసీసీ చీఫ్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు గెలిచిన ఉత్సాహంతోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా నిర్వహిస్తే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నా గ్రౌండ్‌లో కేడర్‌ను సన్నద్ధం చేయడంపై పార్టీ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యేలకు సైతం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టత లేదు. ఎన్నికలు ఎప్పుడు జరపాలని నిర్ణయం తీసుకున్నా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి స్పష్టత ఇచ్చింది.
ఈ నెల చివరకు నోటిఫికేషన్ ? :
ఈ నెల చివరికల్లా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూలు విడుదల కావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పరీక్షలు, మరోవైపు పండుగలు, ఇంకోవైపు బడ్జెట్ సెషన్.. ఇలాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర క్యాబినెట్(Telangana Cabinet) దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నది. ఈ నెల చివరకు నోటిఫికేషన్ ఇస్తే జనవరి థర్డ్ వీక్ లోపు పోలింగ్ ప్రాసెస్‌ను కంప్లీట్ చేసే అవకాశాలున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగనున్నందున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగానే అప్రమత్తమయ్యారు. సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే ఇవి కొంత ఫోకస్ పెట్టే ఎన్నికలు కావడంతో విజయంపై ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ దృష్టి సారించాయి. రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఈ ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానున్నది.
Read Also: ‘విజన్ డాక్యుమెంట్’తో పెట్టుబడుల వేట
Follow Us On: Sharechat


