కలం, వెబ్‌డెస్క్:: నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జీహెచ్‌ఎంసీ (GHMC) ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. డివిజన్ల పునర్విభజన (Divisions Reorganization) ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టగా, బీజేపీ కార్పోరేటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలోనే నిరసన తెలిపిన వారు, ఆ తర్వాత కార్యాలయం ఎదుటికి వచ్చి ఆందోళన చేపట్టారు.
సభలో అధికారులు డివిజన్ల పునర్విభజన (Division Reorganization) ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను ప్రవేశపెట్టిన వెంటనే బీజేపీ (BJP) కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ విభజన ఎంఐఎం (MIM) పార్టీకి అనుకూలంగా జరిగిందని, బీఆర్ఎస్-కాంగ్రెస్-ఎంఐఎం మూడు పార్టీలు కలిసి బీజేపీని ఓడించేందుకు కుట్ర చేశాయని ఆరోపించారు. డీలిమిటేషన్ మ్యాప్ తప్పులతడకగా ఉందని, డివిజన్ల చోరీ జరిగిందని నినాదాలు చేశారు. GHMC మేయర్ బీజేపీ కార్పోరేటర్ల నిరసనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల మధ్య సభను వాయిదా వేశారు. డివిజన్ల పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. సమావేశం అనంతరం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. డివిజన్ల పునర్విభజన గెజిట్ పత్రాలను చించివేసి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నాయక్ తో పాటు కార్పోరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు మాట్లాడారు. వారు కూడా డీలిమిటేషన్‌పై తమ అభ్యంతరాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 150 డివిజన్ల నుంచి సంఖ్యను పెంచి, సమీక్ష చేస్తున్న నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల 17వ తేదీ అభ్యంతరాల స్వీకరణకు చివరి రోజు కాగా, అన్ని పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ విభజన జరుగుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనతో జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read Also: మరో 12 రోజులు ఐబొమ్మ రవిపై విచారణ
Follow Us On: Pinterest


