కలం వెబ్ డెస్క్ : గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కీలక మార్పులు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారం (Financial Burden) మోపనుంది. ఈ పథకాని(Rural Employment Scheme)కి గతంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు అందించేది. అయితే నూతన చట్టంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 చొప్పున నిధులు అందించాల్సి ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (Rural Employment Scheme) చట్టాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో దాని స్థానంలో ఉపాధి హామీ పథకం వికసిత్ భారత్ రోజ్‌గార్, అజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (Viksit Bharat Rozgar Ajeevika Mission) చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో రోడ్లు, కాలువలు, చెరువులు వంటి పనులు చేస్తారు. నూతన చట్టంలోని అంశాలకు అనుగుణంగా ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 125కు పెంచనున్నారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వమే పనులు నిర్ణయించి నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలను నిర్ణయిస్తుంది. ఉపాధి లభించకపోతే నిరుద్యోగ భత్యం సైతం చెల్లిస్తారు.
ఉపాధి(MGNREGA) అందించని పక్షంలో మొదటి 30 రోజులకు వేతనంలో నాలుగో భాగం, తర్వాత రెండో భాగాన్ని వేతనంగా చెల్లిస్తారు. గతంలో ఈ పథకం నిధులను పూర్తిగా కేంద్రమే భరించేది. తాజా చట్టంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరించాలని పేర్కొన్నారు. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం నిధులు ఖర్చు చేయనున్నాయి. ఈ పథకానికి ఏటా రూ.1.51 లక్షల కోట్లు ఖర్చు అవుతాయన్న అంచనాలున్నాయి. ఇందులో కేంద్రం వాటా రూ.95,692 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.55,308 కోట్లుగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం (Central Government) ఈ పథకంలో చేసిన మార్పులను రాష్ట్ర ప్రభుత్వాలు, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేందుకే నానా తంటాలు పడుతున్నాయి. గతంలో ఈ ఉపాధి హామీ పథకం నిధులన్నీ కేంద్రం పూర్తిగా భరించేది. దీంతో రాష్ట్రాలపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా గ్రామాల్లో జల వనరులు, భూ సంరక్షణ వంటి పనులు జరగడంతో పాటు, గ్రామీణ ప్రజలకు ఉపాధి దొరికేది. ఇప్పుడు ఈ పథకానికి రాష్ట్రాలు కూడా 40 శాతం చెల్లించాలంటే కొత్త సమస్యలు ఎదురవుతాయి.
ముఖ్యంగా ఆర్థికంగా బలహీనమైన రాష్ట్రాలకు ఇది పెద్ద సమస్యగా మారనుంది. నిధుల భారం వల్ల రాష్ట్రాలు పథకాన్ని సరిగా అమలు చేయకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించి, పేదల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ప్రవేశపెట్టిన ఈ పథకం లక్ష్యం కూడా నెరవేరకపోవచ్చు. గ్రామీణ భారతాన్ని స్వయం సమృద్ధి దిశగా నడపాల్సిన పథకాన్ని రాష్ట్రాలకు ఆర్థిక భారంగా మారుస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: కొండా సురేఖ వర్సెస్ బస్వరాజు సారయ్య .. వరంగల్‌లో మరోసారి చిచ్చు
Follow Us On: Youtube


