కలం డెస్క్: లియొనాల్ మెస్సీ ఇండియా టూర్‌కు అయిన ఖర్చుపై భారత ఫుట్ బాల్ కోచ్ రంజిత్ బజాజ్(Ranjit Bajaj) కీలక వ్యాఖ్యలు చేశారు. మెస్సీ టూర్ కోసం ఇండియా ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే రూ.150 కోట్లు తనకు ఇస్తే 10 మంది మెస్సీలను రెడీ చేస్తానని అన్నారు. మెస్సీని భారత్‌లోని కేరళకు తీసుకురావడానికి సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొంటూ, ఆ మొత్తాన్ని తనకు ఇస్తే సాకర్ వరల్డ్ కప్ గెలిచే స్థాయిలో పది మంది ‘భారత మెస్సీలను’ తయారు చేస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రంజిత్ బజాజ్(Ranjit Bajaj).. భారత్‌లో ఫుట్‌బాల్ ఎందుకు ఆశించిన స్థాయిలో ఎదగలేకపోతోందో కూడా వివరించారు. ఫుట్‌బాల్‌కు ప్రభుత్వ స్థాయిలో సరైన మద్దతు లేకపోవడం, గ్రాస్‌రూట్ లెవల్‌లో శిక్షణా సదుపాయాల కొరత, దీర్ఘకాలిక ప్రణాళికల లేమి ప్రధాన కారణాలుగా ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రభుత్వం ఫుట్‌బాల్‌కు అండగా నిలిస్తే, ప్రజల నుంచి కూడా ఆటకు భారీ మద్దతు లభిస్తుందని అన్నారు.
‘‘భారత్‌లో ఒక మెస్సీ(Lionel Messi) పుట్టుకొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. విదేశీ మెస్సీకి ఇంత ప్రేమ, అభిమానం చూపిస్తున్నప్పుడు.. ఒక భారత మెస్సీకి లభించే ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించాలి’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. భారత క్రికెట్లో ధోనీ, కోహ్లీ, సచిన్ వంటి దిగ్గజాలు, అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా, షూటింగ్‌లో అభినవ్ బింద్రా లాంటి వరల్డ్ క్లాస్ క్రీడాకారులు ఎదిగినప్పుడు.. ఫుట్‌బాల్ వంటి ఇతర క్రీడల నుంచి కూడా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ‘ఇండియన్ మెస్సీ ఎందుకు పుట్టడం లేదు?’ అన్న ప్రశ్నను ఆయన గట్టిగా లేవనెత్తారు. రంజిత్ బజాజ్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా, క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. విదేశీ స్టార్‌లను ఆహ్వానించడమే కాకుండా, దేశీయ ప్రతిభను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న ఆయన వాదనకు మద్దతు పెరుగుతోంది.
Read Also: షాహీన్ అఫ్రిది బౌలింగ్ రద్దు
Follow Us On: Pinterest


