కలం, వెబ్ డెస్క్: వాయు కాలుష్యం (Delhi air pollution), పొగమంచు కారణంగా ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేస్తున్నాయి. వాయు కాలుష్యం ఈ స్థాయిలో పెరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి? అన్న విషయంలో క్లారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీ 12 వరోజు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో వాయు కాలుష్యంపై చర్చించాలని డిమాండ్ చేసింది. సమావేశాల మరో మూడు రోజుల్లో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ వాయిదా తీర్మానం ఇచ్చింది.
ముఖ్యంగా ఢిల్లీ కాలుష్యం(Delhi air pollution), కనీస మద్దతు ధర చట్టం వంటి అంశాలు ఉభయ సభల్లో చర్చకు రావాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.వాయు కాలుష్యంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్, రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ ఈ అంశంపై వాయిదా తీర్మానం నోటీసులు సమర్పించారు. ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలో ప్రజల ఆరోగ్యంపై కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీ గురుమూర్తి లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. రైతుల ఆదాయం, వ్యవసాయ రంగ భవిష్యత్‌కు ఎంఎస్పీ చట్టం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో, చివరి దశలో లోక్‌సభ, రాజ్యసభల్లో పలు కీలక బిల్లులను ఆమోదింపచేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే విపక్షాలు వాయిదా తీర్మానాలు, నిరసనలతో సభల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే కీలక బిల్లుల ఆమోదం సవాలుగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read Also: కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ
Follow Us On: X(Twitter)


