కలం, వెబ్డెస్క్: రిజర్వేషన్లపై విధించిన 50శాతం పరిమితిని ఎత్తివేయాల్సిందేనని, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే సామాజిక తిరుగుబాటు తప్పదని బీసీ నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ మహాధర్నా(BC Maha Dharna) నిర్వహించారు. ఇందులో అఖిలపక్ష నాయకులు, బీసీ జేఏసీ సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వెనకడుగు వేయదన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గేలకు పరిస్థితి వివరించామని, కేంద్రంపై పోరాడడానికి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ సంస్థలను తమ చేతిలో పెట్టుకొని, బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగివస్తుందన్నారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ నాయకుడు వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర(Vaddiraju Ravichandra) మాట్లాడుతూ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై, చట్టంపై అసెంబ్లీపై బీఆర్ఎస్ అండగా నిలబడిందని గుర్తుచేశారు. అనేక బిల్లులను కాంగ్రెస్, బీజేపీ కలసి ఆమోదించుకున్నాయని, బీసీ రిజర్వేషన్ల బిల్లును మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతు తెలిపి కాంగ్రెస్, బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు.
బీసీలకు బీజేపీ బద్ధ శత్రువు: జాజుల
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు బీజేపీ బద్ధ శత్రువుగా మారిందన్నారు. నాటి మండల్ నుంచి నేటి వరకు బీసీ రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయని బీజేపీ, కేంద్రంపై ఒత్తిడి పెంచని కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షం నేతలను తీసుకొని ఎందుకు ప్రధానిని కలవడం లేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లు అమలుచేసేంత వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, ధర్నా (BC Maha Dharna) లో ఎంపీలు మల్లు రవి, రాపోలు ఆనంద భాస్కర్, వి.హనుమంతరావు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కుంతియా, ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, మహిళా సంఘం అధ్యక్షురాలు మణిమంజరి తదితరులు పాల్గొన్నారు.
Read Also: నెల రోజుల ముందుగానే మీటింగ్.. కేసీఆర్ ఇచ్చే క్లారిటీపై ఊహాగానాలు
Follow Us On: X(Twitter)


