Mobile Popup Ad
Mobile Popup Ad

ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి : చిరుమర్తి లింగయ్య

కలం, నార్కట్‌పల్లి బ్యూరో: నల్గొండ (Nalgonda) జిల్లా నకిరేకల్ (Nakrekal) నియోజకవర్గ పరిధిలోని నార్కెట్‌పల్లి పట్టణ కేంద్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) సందర్శించారు. రోజుల తరబడి కల్లాల్లోనే పేరుకుపోయిన ధాన్యపు రాశులను పరిశీలించిన ఆయన, అక్కడే వేచి ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి గోడును విన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతన్నల బతుకులు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వడ్ల కొనుగోలును సక్రమంగా నిర్వహించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కేంద్రాలకు వచ్చి నెల రోజులు గడుస్తున్నా.. ఇంకా కాంటాలు పెట్టని దుస్థితి నెలకొందని మండిపడ్డారు.

మరోవైపు, లారీల కొరతను సాకుగా చూపి బస్తాకు అదనపు వసూళ్లు చేస్తున్నారని, లారీలు బ్యాక్ చేయడానికి రూ.5 నుండి రూ.6 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నారని రైతులు వాపోయినట్లు ఆయన తెలిపారు. ‘ప్రభుత్వం పేరుకే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది కానీ, ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని” ఆయన ఆరోపించారు. పంట వేసిన నాటి నుండి అమ్ముకునే వరకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. రైతు రాజ్యంలో రైతు కన్నీరు పెడితే ఈ ప్రభుత్వానికి పతనం తప్పదని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను సందర్శించి సమస్యలను తక్షణమే పరిష్కరించే వారమని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేవలం తిట్టడంపై ఉన్న శ్రద్ధ, రైతుల సమస్యల పరిష్కారంపై లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తక్షణమే మొద్దునిద్ర వీడి, యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>