Mobile Popup Ad
Mobile Popup Ad

సహజ వ్యవసాయం వైపు అడుగులు వేయాలి.. రైతులకు తుమ్మల సూచనలు

కలం, వరంగల్ బ్యూరో: మెగా రైతు మేళా రైతు భవిష్యత్తుకు కొత్త దిశ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. గురువారం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రాష్ట్ర మెగా రైతు మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై మాట్లాడారు. మారుతున్న యాంత్రీకరణ, పురుగుల మందులు, ఎరువులు, విత్తనాలు, మార్కెటింగ్ లాంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించడమే ఈ మేళా ప్రధాన ఉద్దేశమన్నారు. రైతులు పంటల సాగులో స్కిల్స్ తెలుసుకుని అధిక దిగుబడి సాధించాలని సూచించారు. భూసారం క్షీణిస్తే ఎంత మందులు వాడినా ప్రయోజనం ఉండదని, భూమిని కాపాడుకోవడం అవసరమని అన్నారు. రసాయన ఎరువుల అధిక వినియోగంతో ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. పూర్వికుల సహజ వ్యవసాయ పద్ధతులను తిరిగి ఆచరించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల సూచించారు.

దేశంలోనే మొక్కజొన్న కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రైతులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా స్ఫూర్తిదాయక ప్రసంగాలు వినాలని తెలిపారు. వివిధ పంటలను సాగు చేస్తున్న రైతుల అనుభవాలను పంచుకోవడం ప్రేరణనిస్తుందన్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాలు, పానీయాలలో కల్తీ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సహజ, సేంద్రియ వ్యవసాయానికి మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం మరింత చేరువగా కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా, పంట కొనుగోళ్లు, రుణమాఫీ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. రైతు సంక్షేమ పథకాలు, విద్యుత్ సరఫరా, సన్న బియ్యానికి బోనస్ వంటి కార్యక్రమాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నాయని తెలిపారు.

ఆదర్శ రైతులకు సన్మానం

మెగా రైతులు మేళాలో ఆదర్శ రైతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్, రాష్ట్ర హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>