కలం డెస్క్: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) తన ఫామ్‌పై వస్తున్న విమర్శలను ఖండించాడు. తాను ఫామ్‌లోనే ఉన్నానని అన్నాడు. ప్రతిమ్యాచ్‌లో కూడా సాధ్యమైనన్ని పరుగులు చేయడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పాడు. అయితే పెద్దగా పరుగులు రావడం లేదన్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. కాగా తాను ఫామ్ కోల్పోలేదని గట్టిగా చెప్పాడు. నెట్స్‌లో తాను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నానని, మ్యాచ్‌ల్లో పరుగులు చేయడానికి తన నియంత్రణలో ఉన్న ప్రతిదాన్నీ ప్రయత్నిస్తున్నానని వెల్లడించాడు.
మూడో టీ20 మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చాడు. “నేను నెట్స్‌లో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. మ్యాచ్‌ల్లో పరుగులు చేయడానికి నా వంతు ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాను. పరుగులు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాయి. నేనూ నా బ్యాట్ నుంచి పెద్ద స్కోర్లు రావాలని ఎదురుచూస్తున్నాను. నేను ఫామ్ కోల్పోలేదు, కానీ ప్రస్తుతం పరుగులు రావడం లేదు” అని సూర్య స్పష్టం చేశాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ సమష్టిగా రాణించి సౌతాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే ఈ విజయ మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పరంగా మరోసారి నిరాశపరిచాడు. కేవలం 12 పరుగులకే ఔటయ్యాడు. దీంతో అతడి పేలవ ఫామ్‌పై చర్చ మరింత ఊపందుకుంది.
గత 21 టీ20 ఇన్నింగ్స్‌లుగా సూర్య ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ కాలంలో అతడు చేసిన మొత్తం పరుగులు 239 మాత్రమే. సగటు 13.27గా ఉండగా, స్ట్రైక్‌రేట్ కూడా 118.90కే పరిమితమైంది. జట్టు వరుస విజయాలు సాధిస్తున్నప్పటికీ, కెప్టెన్ బ్యాటింగ్ ఫామ్ మాత్రం అభిమానులు, నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
Read Also: సూర్యకుమార్ యాదవ్‌పై ఆకాష్ చోప్రా ఘాటు వ్యాక్యలు
Follow Us On: Sharechat


