కలం, వెబ్‌డెస్క్: అతిరథ మహారథులు.. రాజకీయ చాణక్యులు… కాకలుతీరిన కార్యదక్షులు.. వీళ్లందరినీ కాదని భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికయ్యారు నితిన్ నబీన్ (Nitin Nabin). ఇప్పుడు ఈయన ఖాతాలో మరో ఘనత కూడా చేరే అవకాశం ఉంది. అదే అధ్యక్ష పీఠం! ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం పూర్తయినప్పటికీ అధిష్టానం గడువు పొడిగించింది. ఈ క్రమంలో అన్నీ కలిసొస్తే, అధిష్టానం కరుణిస్తే బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎంపికకావడం ఖాయమే. అదే జరిగితే నితిన్ గడ్కరీ తర్వాత అత్యంత పిన్న వయస్సులో భారతీయ జనతా పార్టీ సారథి అయిన వ్యక్తిగా నితిన్ నబీన్ రికార్డు సృష్టిస్తారు. గడ్కరీ 53 ఏళ్ల వయస్సులో అధ్యక్షుడవగా, ప్రస్తుతం 45 ఏళ్ల వయస్సున్న నితిన్ నబీన్ ఆ రికార్డును తిరగరాసే అవకాశం ఉంది. మరోవైపు 1980లో అటల్ బిహారీ వాజ్‌పేయీ బీజేపీ తొలి అధ్యక్షుడవగా ఆ తర్వాత మరో 10 మందికి అవకాశం దక్కింది. ఇందులో అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్ ఒకటి కంటే ఎక్కువ సార్లు అధ్యక్షులుగా వేర్వేరు కాలాల్లో పనిచేశారు.
ఎంపిక లాంఛనమేనా?
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. జాతీయ కౌన్సిల్ సభ్యులు సమావేశమై అధ్యక్షుడిగా పోటీచేసేవారిని ఎన్నుకుంటారు. దీనికి ముందే పార్టీ జాతీయ కార్యాలయం నామినేషన్లు వేయాల్సిందిగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. సహజంగా పార్టీ అగ్ర నాయకత్వం చెప్పిన వ్యక్తి మాత్రమే నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. అనంతరం ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ల ద్వారా ఎన్నుకున్నట్లు పార్టీ ప్రకటిస్తుంది. ప్రతీ రాష్ట్రంలోని జాతీయ కౌన్సిల్ సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. తెలంగాణ నుంచి 17 మంది సభ్యులున్నారు. బీజేపీ సంస్థాగత నియమం ప్రకారం ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఒకరు చొప్పున జాతీయ కౌన్సిల్ సభ్యులుంటారు. ఈ సంఖ్య పెంచాలని తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు ఉన్నాయి. కానీ ఇప్పటికీ పెంపుపై నిర్ణయం తీసుకోలేదు. తాజాగా నితిన్ నబిన్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీజేపీ పార్లమెంటరీ బోర్డు నామినేట్ చేసినందువల్ల ఆయనే తదుపరి ప్రెసిడెంట్ అయ్యే అవకాశమున్నది. తద్వారా పార్టీ చరిత్రలో అతి చిన్న వయసులో ప్రెసిడెంట్ అయిన ఘనత ఈయనకే దక్కుతుంది.
ఎవరీ నితిన్ నబిన్?:
బిహార్‌లోని పట్నా నితిన్ నబీన్ (Nitin Nabin) జన్మస్థలం. బీజేపీ దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే నబిన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లో ప్రవేశించాడు. అంతకుముందు ఏబీవీపీలో పనిచేసి బీజేపీ సిద్ధాంతాలను ఒంటపట్టించుకున్నారు. తండ్రి మరణం తర్వాత పాట్నా పశ్చిమ నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత బంకీపూర్ స్థానం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నితీష్ మంత్రివర్గంలో రెండు సార్లు పనిచేశారు. ఇటీవల జరిగిన బిహార్ శాసనసభ ఎన్నికల్లో 51వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కాగా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన నితిన్ నబీన్‌కు ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘సమర్థుడైన కార్యకర్త. సంస్థాగతంగా గొప్ప అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా అద్భుత రికార్డు ఆయన సొంతం. ఆయన పనితీరు రాబోయే కాలంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నాను’ అని ‘ఎక్స్’లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read Also: కవితపై జగ్గారెడ్డి ఫైర్
Follow Us On: X(Twitter)


