epaper
Friday, January 16, 2026
spot_img
epaper

త్వరలో మంత్రివర్గంలో మార్పులు.. TPCC చీఫ్

కలం డెస్క్ : రాష్ట్ర మంత్రివర్గంలో (Telangana Cabinet) త్వరలోనే మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) సూచనప్రాయంగా తెలిపారు. ‘ఓట్ చోరీ’ (Vote Chori Protest) నిరసన కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో ఉన్న పీసీసీ చీఫ్ మీడియాతో చిట్‌చాట్ చేస్తూ, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్ తదితరుల విషయంలో పార్టీ సంతృప్తికరంగానే ఉన్నట్లు తెలిపారు. వారి పనితీరు విషయంలో ఎలాంటి అసంతృప్తీ లేదన్నారు. ప్రస్తుతం క్యాబినెట్‌లో మరో రెండు ఖాళీ బెర్తులను నింపే విషయమై మాట్లాడుతూ, మొత్తం మంత్రివర్గంలోనే కొన్ని మార్పులు ఉంటాయనుకున్నట్లు తెలిపారు. మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ పవర్‌లోకి రావడం ఖాయమని, ఇది నల్లేరు మీద నడక లాగానే ఉంటుందన్నారు.

బీఆర్ఎస్‌కు అధికారం రావడం కల్ల :

వచ్చేసారి జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ అధికారంలోకి రావడం గురించి మాట్లాడుతూ, అది కలగానే మిగిలిపోతుందన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఆ పార్టీకి సిట్టింగ్ స్థానమని, ఉప ఎన్నికలో ఆ పార్టీ గెలుస్తుందని గంభీరంగా చెప్పుకున్నా చివరకు ఓడిపోక తప్పలేదన్నారు. ఆ సంగతి కేసీఆర్‌కు తెలుసు కాబట్టే ప్రచారానికి కూడా రాలేదన్నారు. నిజానికి ఆ పార్టీకి అంత మంచి ఫ్యూచర్ ఉందనుకుంటే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత (Kavita) ఆ పార్టీ నుంచి ఎందుకు బైటకు వస్తారని ఎదురు ప్రశ్నించారు. పార్టీకి, కేటీఆర్‌కు డబ్బులున్నందునే సోషల్ మీడియాను పెట్టుకుని నడిపించుకుంటున్నారని, కొన్ని మీడియా సంస్థలను మేనేజ్ చేసుకుంటున్నారని అన్నారు. సీఎం కావాలన్న కోరికను కవిత బైటపెట్టుకున్నారని, చాలా మందికి ఆ డ్రీమ్ ఉన్నట్లే ఆమెకు కూడా ఉందన్నారు. కానీ ఆమెది మాత్రం అత్యాశే అని అన్నారు.

కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌కు ఇమేజ్ :

హైదరాబాద్ నగరానికి గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని, సిటీలో మౌలిక సౌకర్యాలూ పెరిగాయని, ఇకపైన విశ్వ నగరంగా మారడం కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో ఫోర్త్ సిటీగా గుర్తింపు వస్తుందని, దీని వెన్నంటే పెట్టుబడులు, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కూడా వస్తాయన్నారు. నగర అభివృద్ధిని ఆపడం సాధ్యం కాదన్నారు. ఇండియాలో బెస్ట్ సిటీగా మాత్రమే కాక ప్రపంచంలోని పలు ప్రఖ్యాత నగరాలతో పోటీపడేలా ఎదుగుతుందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం ఉన్నదన్నారు.

బీజేపీకి తెలంగాణలో బేస్ ఉండదు :

బీజేపీ (BJP) ఎప్పటికీ తెలంగాణలో అధికారం చేపట్టే అవకాశమే రాదని పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ డ్యామేజ్ కావడానికి ‘సర్’ (SIR) ఒక్కటి చాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేవీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లేవని గుర్తుచేశారు. సంక్షేమానికి కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నదని, అలాంటప్పుడు బీజేపీని ప్రజలు ఎందుకు ఆదరిస్తారని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలకు అధికారం లేకపోతే మనుగడ కష్టమవుతుందని, కర్ణాటకలో దేవెగౌడ స్థాపించిన పార్టీయే అందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బైట నుంచి ఎవరో వచ్చి ఏదో చేయాల్సిన అవసరం లేదని, హరీశ్‌రావు సరైన సమయంలో దెబ్బ కొడతారని అన్నారు. ఇంకోవైపు కవిత కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా బ్యాటింగ్ చేస్తున్నారని తనదైన శైలిలో అన్నారు.

 Read Also: మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం : రాహుల్​ గాంధీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>