కలం, వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు చైతన్యం ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల కంటే సహజంగానే పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. తాజాగా రెండో విడతలోనూ అదే ట్రెండ్ కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిగూడెం (Jangareddy Gudem) గ్రామంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 98 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదైన గ్రామంగా జంగారెడ్డిపల్లి రికార్డు సృష్టించింది.
జంగారెడ్డి గూడెంలో (Jangareddy Gudem) ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. యువత, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకొచ్చారు. గ్రామాభివృద్ధిలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందనే అవగాహనతో ప్రజలు బాధ్యతాయుతంగా పోలింగ్‌లో పాల్గొన్నారు.
గ్రామస్తుల్లో చైతన్యం పెంపొందించేందుకు స్థానిక నాయకులు, ఎన్నికల అధికారులు ముందుగానే అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, వాటి ఫలితంగా ఈ స్థాయిలో పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పంచాయతీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. వార్డు స్థాయిలో ప్రతి ఓటును లెక్క వేసుకుంటారు. ప్రలోభాల పర్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో పోలింగ్ కూడా పోటెత్తుతూ ఉంటుంది. పట్టణప్రాంతాల్లో ఉండేవాళ్లు, సూదూర ప్రాంతాల్లో ఉండేవాళ్లు కూడా గ్రామాల బాట పట్టి ఓట్లు వేస్తూ ఉంటారు.
Read Also: పూరీ ఆలయంపై పక్షుల చక్కర్లు.. మళ్లీ అదే జరగబోతుందా?
Follow Us On: Instagram


