కలం, వెబ్‌డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. రోడ్ ఐలాండ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిష్టాత్మక బ్రౌన్ యూనివర్సిటీ (Brown University) క్యాంపస్‌లో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ భవనంలో ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులు జరిపినట్లు బ్రౌన్ యూనివర్సిటీ ప్రొవోస్ట్ (సీనియర్ అధికారి) ఫ్రాంక్ డోయల్ వెల్లడించారు.
బ్రౌన్ యూనివర్సిటీ (Brown University) కాల్పుల ఘటనతో క్యాంపస్‌లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు పాల్పడిన దుండగుడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా క్యాంపస్‌ను తాత్కాలికంగా లాక్‌డౌన్ చేసినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
Read Also: సమ్మిట్ సమిష్టి నిర్ణయం కాదా?
Follow Us On: Youtube


