epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జీఎస్‌డీపీలో తెలంగాణ టాప్.. ఆర్బీఐ నివేదిక విడుదల

కలం, వెబ్‌ డెస్క్: తెలంగాణ రాష్ట్రం పలు రంగాల్లో ముందంజలో ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI Report) తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్‌బీఐ 2024-25 గణాంకాలను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో తలసరి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP)లో తెలంగాణ టాప్ లో నిలిచింది. రూ.3.87 లక్షల తలసరి జీఎస్‌డీపీతో టాప్ ర్యాంకు సాధించగా, కర్ణాటక రూ.3.80 లక్షలు, తమిళనాడు రూ.3.61 లక్షలతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఢిల్లీ రూ.4.93 లక్షల తలసరి జీఎస్‌డీపీతో ముందువరుసలో ఉంది.

పరిశ్రమలు, సేవారంగంలో దూకుడు

తలసరి జీఎస్‌డీపీ(GSDP)నే సాధారణంగా వార్షిక తలసరి ఆదాయంగా కూడా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలు, సేవారంగం, వ్యవసాయం తదితర రంగాల్లో తెలంగాణలో (Telangana) గతేడాది అధిక ఆర్థిక కార్యకలాపాలు నమోదవడం వల్లే దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచినట్లు ఆర్‌బీఐ నివేదిక (RBI Report) విశ్లేషించింది. ఇదే సమయంలో ఏపీ తలసరి జీఎస్‌డీపీ రూ.2.66 లక్షలకే పరిమితమైంది.

మొత్తం జీఎస్‌డీపీ పరిమాణం పరంగా చూస్తే మాత్రం మహారాష్ట్ర రూ.45.31 లక్షల కోట్లతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. తరువాత తమిళనాడు రూ.31.18 లక్షలు, కర్ణాటక రూ.29.83 లక్షల కోట్లతో రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. తెలంగాణ మొత్తం జీఎస్‌డీపీ రూ.16.40 లక్షల కోట్లతో 7వ స్థానంలో, ఏపీ రూ.15.93 లక్షల కోట్లతో 8వ స్థానంలో ఉన్నాయి. విద్యుత్ వినియోగం, లభ్యతలోనూ తెలంగాణ ముందంజలోనే ఉంది. వార్షిక తలసరి విద్యుత్ లభ్యతలో పంజాబ్ 2,503 యూనిట్లతో తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ 2,306 యూనిట్లతో రెండో స్థానం, హర్యానా 2,293 యూనిట్లతో మూడో స్థానం దక్కించుకున్నాయి.

తెలంగాణలో (Telangana) 3.7 శాతం ద్రవ్యోల్బణం

జాతీయ సగటు మాత్రం 1,208 యూనిట్లుగానే ఉంది. ద్రవ్యోల్బణం విషయంలో వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారంగా తెలంగాణలో 3.7 శాతం ద్రవ్యోల్బణం నమోదై దేశంలో 29వ స్థానంలో నిలిచింది. ఏపీలో ఇది 4.4 శాతంగా ఉండి 16వ ర్యాంకులో ఉంది. జాతీయ సగటు ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండగా, అత్యధికంగా మణిపుర్‌లో 6.5 శాతం, బిహార్‌లో 6 శాతం నమోదైంది. వ్యవసాయ రంగంలో వరి సాగు విస్తీర్ణంలో ఉత్తర్‌ప్రదేశ్ 73.90 లక్షల హెక్టార్లతో మొదటి స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్ 55.92 లక్షల హెక్టార్లు, తెలంగాణ 48.09 లక్షల హెక్టార్లతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. వాతావరణ పరిస్థితుల పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో శీతల గాలులు వీచిన రోజులు ఒక్కటైనా నమోదు కాలేదు. వడగాలుల విషయానికి వస్తే ఏపీలో 10 రోజులు, తెలంగాణలో ఒక్కరోజు మాత్రమే నమోదైనట్లు నివేదిక తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ద్రవ్యలోటు

అయితే తెలుగు రాష్ట్రాల్లో ద్రవ్యలోటు క్రమంగా పెరుగుతున్నట్లు ఆర్‌బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏపీలో వార్షిక ఆర్థిక ద్రవ్యలోటు రూ.68,743 కోట్లుగా నమోదవగా, తెలంగాణలో (Telangana) రూ.49,255 కోట్లుగా ఉంది. ఈ విషయంలో ఏపీ 6వ ర్యాంకు, తెలంగాణ 9వ ర్యాంకులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా రూ.1.10 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఉండగా, తమిళనాడులో రూ.1.08 లక్షల కోట్ల లోటు నమోదైంది. ఈ లోటును భర్తీ చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త రుణాలను సమీకరిస్తున్నాయి. రుణాల భారం విషయానికొస్తే గతేడాది చివరికి తెలంగాణ ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు రూ.4.42 లక్షల కోట్లుగా ఉండగా, ఏపీ ప్రభుత్వం రూ.5.40 లక్షల కోట్ల రుణాలు తీసుకుంది.

Read Also: టికెట్లు ఉంటేనే మ్యాచ్ కు రండి: సీపీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>