కలం, వెబ్‌డెస్క్: 2027 సంవత్సరానికి సంబంధించిన గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu 2027) తేదీలు ఖరారయ్యాయి. తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఈ తేదీలను నిర్ణయించారు. జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నారు. గురుగ్రహ ప్రవేశం నేపథ్యంలో గోదావరి నదికి పుష్కరాలు నిర్వహించే సంప్రదాయం ఉన్న సంగతి తెలిసిందే.
జ్యోతిష్య గణనల ప్రకారం 2027లో గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించే సందర్భాన్ని పురస్కరించుకొని గోదావరి పుష్కరాలకు సంబంధించిన తేదీలను ఖరారు చేసినట్లు దేవాదాయశాఖ పేర్కొంది. పుష్కరాల తొలి రోజు జూన్ 26న మహా పుష్కర స్నానంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. చివరి రోజు జూలై 7న ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
గోదావరి తీర ప్రాంతాల్లోని ఆలయాలు, ఘాట్లలో పుష్కర కాలంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. భక్తుల సౌకర్యం కోసం అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై ముందుగానే ప్రణాళికలు రూపొందించనున్నారు. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమన్వయంతో గోదావరి పుష్కరాలకు (Godavari Pushkaralu 2027) సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నారు. తేదీలు ఖరారు కావడంతో పుష్కరాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణను దశలవారీగా సిద్ధం చేసే ప్రక్రియను దేవాదాయ శాఖ త్వరలో ప్రారంభించనుంది.
Read Also: నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ
Follow Us On: X(Twitter)


