కలం డెస్క్ : ప్రపంచ ఫుట్ బాల్ ప్లేటర్ మెస్సీ (Lionel Messi) ఆట చూసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్ వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ వర్సెస్ మెస్సీ (Revanth Vs Messy Match) మ్యాచ్ చూసేందుకే ఆయన వస్తున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. మధ్యాహ్నం 4.15 గంటలకు హైదరాబాద్ చేరుకున్న తర్వాత పార్టీ నేతలతో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భేటీ అవుతారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ (Telangana Rising Global Summit) పై చర్చిస్తారు. రెండేండ్ల పాలన ఎలా ఉన్నదో, మేనిఫెస్టోలోని హామీల అమలుపైనా ఆరా తీస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుపై పీసీసీ చీఫ్ వివరిస్తారు. రాత్రి 7.15 నుంచి 9.15 గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్‌కు అటెండ్ అవుతారు. ఆ తర్వాత నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళి 10.30 గంటల ఫ్లైట్‌కు ఢిల్లీకి రిటన్ అవుతారు.
రైతులపై లేని ప్రేమ ఫుట్‌బాల్ మ్యాచ్‌పైనా? :
రాష్ట్రంలో అకాల వర్షాలు, రుతుపవనాలతో వరదలు వచ్చి రైతులు పంట కోల్పోయినప్పుడు కనీసం సందర్శించని రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఇప్పుడు ఫుట్‌బాల్ మ్యాచ్‌కు రావడం పొలిటికల్ చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌కు సైతం గైర్హాజరయ్యారు. పార్టీ సీనియర్ నేతలు సైతం అటెండ్ కాలేదు. రైతు డిక్లరేషన్‌ను రిలీజ్ చేసి సంక్షేమాన్ని అందిస్తున్నా కష్టాల్లో ఉన్నప్పుడు వారిని పట్టించుకోని రాహుల్‌గాంధీ ఇప్పుడు ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేయడానికి రావడాన్ని బీఆర్ఎస్ విమర్శిస్తున్నది. సోషల్ మీడియాలో ఇప్పటికే సెటైర్లు దర్శనమిస్తున్నాయి. గద్దర్(Gaddar) కుటుంబంతో గాంధీ ఫ్యామిలీకి మంచి సంబంధాలే ఉన్నా అటెండ్ కాలేదన్న విమర్శలు అప్పట్లోనే వినిపించాయి. అందెశ్రీ రాసిన గేయం రాష్ట్ర గీతంగా ఆమోదించినా ఆయన ఇటీవల చనిపోయినప్పుడు కూడా రాహుల్‌గాంధీ రాలేదు. ఇవన్నీ ఇప్పుడు ఆయనపై విమర్శలకు దారితీస్తున్నాయి.
మరోసారి తెలంగాణ హైలైట్ :
గ్లోబల్ సమ్మిట్‌లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ (MoU)లు కుదుర్చుకుని చరిత్ర సృష్టించిన తెలంగాణ ఇప్పుడు మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌తో జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించనున్నది. దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులు గ్లోబల్ సమ్మిట్‌కు హాజరై రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరిచారు. ఇప్పుడు మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌తో మరోసారి ప్రపంచం దృష్టి తెలంగాణపై పడనున్నది. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈవెంట్ కాదని పీసీసీ నేతలు రాహుల్ విజిట్‌ను సమర్ధించుకుంటున్నారు. ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న ఈవెంట్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు ఒక పొలిటీషియన్‌గా, పీసీసీ చీఫ్‌గా, ముఖ్యమంత్రిగా చూసిన రేవంత్‌రెడ్డిని రాష్ట్ర, దేశ ప్రజలు రెండు గంటల మ్యాచ్‌లో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా చూడబోతున్నారు.
Read Also: ఇలాగైతే కష్టమే… ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ వార్నింగ్
Follow Us On: X(Twitter)


