కలం డెస్క్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిందని ఘనంగా సంబురాలు జరిగాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) సందర్భంగా రెండు రోజులు నగరంలో పండుగ వాతావరణం కనిపించింది. మంత్రులంతా ఈ రెండేండ్లలో సాధించిన ప్రగతిని నివేదికలు, ప్రసంగాల రూపంలో గొప్పగా చెప్పుకున్నారు. కానీ అప్పటికే చాపకింద నీరులా ఉన్న కొద్దిమంది మంత్రుల(Telangana Ministers) అసంతృప్తి రెండు రోజుల్లో వేదిక నిర్వహణతో తారస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వన్ మ్యాన్ షో (One-man show)గా నిర్వహించారన్న మాటలు వినిపించాయి. గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశం మొదలు సమ్మిట్ ముగింపు సందర్భంగా డయాస్ మీద లాంఛనంగా ఆవిష్కరించేంత వరకు అంతా ఏకపక్షంగా జరిగిందన్న గుసగుసలూ వినిపించాయి.
డయాస్‌పై మంత్రి లేకపోవడంపైనా చర్చ :
గ్లోబల్ సమ్మిట్‌లో(Global Summit) భారీ స్థాయిలో పెట్టుబడులు తేవడంలో పరిశ్రమల శాఖ (Industries) కీలకంగా వ్యవహరించింది. కానీ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా ఆ శాఖ మంత్రిని డయాస్ మీదకు పిలవకపోవడాన్ని కొందరు బ్యూరోక్రాట్‌లు నిశితంగా గమనించారు. ఎందుకు ఆహ్వానించలేదన్న చర్చ అధికారుల మధ్య మొదలైంది. సినీ నటుడు చిరంజీవి(Chiranjeevi)కి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రత్యేక అతిథిగా ఆహ్వానించిన నిర్వాహకులు సంబంధిత శాఖ మంత్రిని ఎందుకు విస్మరించారన్నది ఆ చర్చల్లోని కీలక అంశం. డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా కింది వరుసలోనే మంత్రి కూర్చున్నారు. ఏయే కంపెనీల ప్రతినిధులను సమ్మిట్‌కు పిలవాలనే ప్రాథమిక చర్చల మొదలు విజన్ రూపకల్పన, ఏర్పాట్లు, సక్సెస్ చేయడానికి అవసరమైన కమిటీల కూర్పు.. ఇలా అన్ని దశల్లోనూ ఇండస్ట్రీస్ డిపార్టుమెంటు కీలకంగా వ్యవహరించినా మంత్రికి తగిన గుర్తింపు గౌరవం దక్కలేదన్నది ఆ గుసగుసల సారాంశం.
కార్యదర్శి బదిలీతో వివాదం ప్రారంభం :
ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా కొన్ని వారాల ముందు సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. గత ప్రభుత్వం నుంచీ పరిశ్రమల శాఖకు సెక్రటరీగా కొనసాగుతున్న జయేశ్ రంజన్ కంటిన్యూ కావడంపై సచివాలయ వర్గాల్లో చాలాకాలంగా చర్చ జరుగుతూ ఉన్నది. చివరకు ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాలన్న ప్రతిపాదన సీఎం కార్యాలయానికి చేరింది. దీనికి తోడు మంత్రికి, కార్యదర్శికి మధ్య పాజిటివ్ వాతావరణం లేదన్నది బ్యూరోక్రాట్ల మధ్య ఒక రెగ్యులర్ టాపిక్‌గా మారింది. దానికి తగినట్లుగానే ఆ శాఖ నుంచి జయేశ్ రంజన్‌ను తప్పించిన ప్రభుత్వం సీఎంఓకు బదిలీ చేసింది. పరిశ్రమల శాఖకు సంజయ్ కుమార్‌ను కార్యదర్శిగా (స్పెషల్ సీఎస్) నియమించింది. జయేశ్ రంజన్ సీఎంఓకు బదిలీ అయినా ఆయనను పరిశ్రమల శాఖ వ్యవహారాలు చూసే బాధ్యత దక్కింది. దీంతో సమస్య మరో రూపంలో కొనసాగింది.
చిచ్చు రేపిన ‘హిల్ట్’ లీకేజీ ఇష్యూ :
‘హిల్ట్’ (HILT) పాలసీ డాక్యుమెంట్ అఫిషియల్ రిలీజ్‌కు ముందే విపక్షాలకు లీక్ కావడం ప్రభుత్వంలో పెద్ద చర్చకు దారితీసింది. క్యాబినెట్ స్థాయిలో మాత్రమే సర్క్యులేషన్‌లో ఉన్న డాక్యుమెంట్ కేటీఆర్ చేతికి వెళ్ళడం సీరియస్ తప్పుగా మారింది. ఎవరు లీక్ చేశారు.. ఏ స్థాయి ఆఫీసర్ నుంచి లీక్ అయింది.. అనే అంశంపై ప్రభుత్వం సీరియస్ దృష్టి పెట్టింది. చివరకు ఇంటెలిజెన్స్ దర్యాప్తు మొదలైంది. ఆ శాఖలోని సిబ్బంది ఒకరినొకరు అనుమానించుకునే తరహాలో వాతావరణం మారిపోయింది. ఇప్పటికీ ‘లీక్ వీరులు’ ఎవరనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ పాలసీ డాక్యుమెంట్ కూర్పు విషయంలో సంబంధిత మంత్రికి కూడా పూర్తి స్థాయి సమాచారం తెలియదనే అభిప్రాయాలూ ఆ శాఖ వర్గాల నుంచి వ్యక్తమయ్యాయి. మరోవైపు గ్లోబల్ సమ్మిట్‌కు దాదాపు 500 కంపెనీలను ఆహ్వానిస్తే అందులో మూడవ వంతు మాత్రమే హాజరు కావడం సరికొత్త చర్చకు దారితీసింది. ఇండిగో (Indigo) విమాన సర్వీసుల సంక్షోభం కారణమేమో అని సర్దిపుచ్చుకోవాల్సి వచ్చింది.
నెక్స్ట్ క్యాబినెట్ భేటీపైనే ఆసక్తి :
గ్లోబల్ సమ్మిట్‌లో విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా సంబంధిత మంత్రికి వేదికపై స్థానం లేకపోవడమే ఇప్పుడు సెక్రటేరియట్ కారిడార్లలో హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీస్ డిపార్టుమెంట్ సెక్రటరీ బదిలీ వ్యవహారం మొదలు హిల్ట్ పాలసీ లీకేజీ, తాజాగా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ వరకు చోటుచేసుకున్న రకరకాల పరిణామాలు చివరకు పలువురు మంత్రుల(Telangana Ministers) మధ్య అసంతృప్తి స్థాయికి చేరుకున్నది. భారీ పెట్టుబడులకు ఎంఓయూ (MoU)లు కుదిరి గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయినా పరిశ్రమల శాఖలోని అనుమానపు వాతావరణం, సచివాలయ వర్గాల్లో అధికారుల మధ్య గుసగుసలు మాత్రం ఊహకు అందని తీరులో గుప్పుమంటున్నాయి. ఇకపైన జరగబోయే క్యాబినెట్ భేటీలో ఎలాంటి వాడివేడి వాతావరణానికి దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: ప్రియాంకకు పగ్గాలు అప్పగించండి.. సోనియాకు పార్టీ మాజీ ఎమ్మెల్యే లేఖ
Follow Us On: Instagram


