కలం డెస్క్ : గడచిన ఐదేండ్ల కాలంలో దాదాపు తొమ్మిది లక్షల మంది (8,96,843) ఇండియన్స్ భారత పౌరసత్వాన్ని (Indian Citizenship) వదులుకున్నారు. 2019 నుంచి ఏటేటా పౌరసత్వం వదులుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ ఉన్నది. ద్వంద్వ పౌరసత్వం ఇండియాలో చెల్లుబాటు కాకపోవడంతో ఇక్కడి సిటిజెన్‌షిప్ వదులుకుని వారు ఉంటున్న దేశాల్లోని పౌరసత్వాన్నే తీసుకుంటున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాల్లో స్థిరపడి అక్కడి పౌరసత్వాన్ని తీసుకున్నారు. వీరిలో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, ఇంజినీర్లు ఉన్నారు. గడచిన ఐదేండ్లలో దాదాపు తొమ్మిది లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకుంటే దానికి ముందు తొమ్మిదేండ్లలో 11.89 లక్షల మంది వదులుకున్నారు. విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ లాంటి బడా పారిశ్రామికవేత్తలపై అవినీతి, అక్రమాల ఆరోపణలు రావడంతో విదేశాల్లో స్థిరపడి అక్కడి పౌరసత్వాన్ని తీసుకున్నవారూ ఈ జాబితాలో ఉన్నారు.
హై ప్రొఫైల్ జీవితమే ప్రధాన కారణం :
ఇతర దేశాల్లో భారీ స్థాయి వేతనాలు, ఉద్యోగ భరోసా, విస్తృత అవకాశాలు, సంపద పోగు చేసుకోడానికి ఉన్న అవకాశాలు, పన్నుల విధానంలో సరళ విధానాలు.. ఇలాంటి కారణాలను గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ నివేదిక ప్రస్తావించింది. పెట్టుబడులు పెట్టడానికి సౌకర్యవంతంగా ఉండే విధానాలు, భారత్‌లో లభించని ప్రోత్సాహకాలు, సంపద పన్ను తక్కువగా ఉండడం.. ఇలాంటివి వారిని విదేశాల్లో స్థిరపడి అక్కడి పౌరసత్వాన్ని తీసుకోడానికి పురిగొల్పుతున్నట్లు గుర్తించింది. దాదాపు రెండు శాతం మంది మిలియనీర్లు లైఫ్‌స్టైల్, ఆర్థిక కోణాల నుంచే ఆలోచించి భారత్ సిటిజెన్‌షిప్(Indian Citizenship) వదులుకున్నట్లు పేర్కొన్నది. మెరుగైన వైద్య సౌకర్యాలు, పర్యావరణ అనుకూల పరిస్థితులు, కాలుష్యం లేకపోవడం, మహిళలు-పిల్లలు-వృద్ధులకు భద్రత ఎక్కువగా ఉండడం, సోషల్ సెక్యూరిటీ.. ఇలాంటి అంశాలన్నీ వారు ఈ నిర్ణయం తీసుకోడానికి దోహదపడుతున్నట్లు హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు పేర్కొన్నది. భారత్‌లోని మిలియనీర్లలో (Millionaires) దాదాపు ఆరున్నర వేల మంది ఇలాంటి కారణాలతోనే ఈ దేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు పేర్కొన్నది.
15 ఏండ్లలో 21 లక్షల పౌరసత్వాలు… :
యూపీఏ హయాంలో ఏటా లక్ష మందికి పైగా పౌరసత్వాన్ని వదులుకోగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఐదేండ్లలోనూ అదే తరహా ట్రెండ్ కంటిన్యూ అయింది. కానీ రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత పౌరసత్వం వదులుకునేవారి సంఖ్య పెరిగింది. దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. సంవత్సరాలవారీగా ఈ గణాంకాలు ఇలా ఉన్నాయి.
2011 1,22,819
2012 1,20,983
2013 1,31,405
2014 1,29,328
2015 1,31,489
2016 1,41,603
2017 1,33,049
2018 1,34,561
2019 1,44,017
2020 85,286
2021 1,63,370
2022 2,25,620
2023 2,16,219
2024 2,06,378
Read Also: లోయలో పడిన బస్సు: పది మంది దుర్మరణం
Follow Us On: X(Twitter)


