కలం, వెబ్‌డెస్క్: బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో ఎయిడ్స్ కేసుల (HIV Cases) కలకలం రేగింది. తామరతంపరగా పుట్టుకొస్తున్న కొత్త కేసులు దీనికి కారణం. జిల్లా కేంద్రంలోని ఎయిడ్స్ చికిత్స కేంద్రం ఏఆర్టీ వెల్లడించిన లెక్కల ప్రకారం ప్రస్తుతం ఇక్కడ మొత్తం 7,400 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 400 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. ఏఆర్టీ సెంటర్ అధికారుల ప్రకారం జిల్లాలో ఎయిడ్స్ వేగంగా వ్యాపిస్తూ, ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇక్కడ నెలకు కనీసం 40 నుంచి 60 వరకు కొత్త కేసులు నమోదవుతున్నట్లు జిల్లా వైద్యాధికారి ఒకరు చెప్పారు.
నిరక్షరాస్యత.. నిర్లక్ష్యం:
బిహార్‌లోని అత్యంత వెనకబడిన జిల్లాల్లో ఒకటైన సీతామర్హిలో అక్షరాస్యత తక్కువ. పేదరికం ఎక్కువ. ఫలితంగా చాలా మందికి ఎయిడ్స్ వ్యాప్తిపై సరైన అవగాహన లేదు. పైగా ఇక్కడి నుంచి వలసలు ఎక్కువ. చాలా మంది పెళ్లిళ్లు బంధువులు, చుట్టాల వాళ్లనే చేసుకుంటుండడంతో సరైన ముందస్తు ఆరోగ్య పరీక్షలు సైతం ఉండడం లేదు. దీనికితోడు తల్లిదండ్రుల్లో ఎవరికి ఎయిడ్స్ ఉన్నా అది పిల్లలకు వారసత్వంగా వస్తోంది. మరోవైపు ప్రభుత్వాధికారులు ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది. గ్రామీణ స్థాయిలో సరైన చైతన్య కార్యక్రమాలు, అవగాహన సెంటర్లు ఏర్పాటుచేయకపోవడంతో ఎయిడ్స్ కేసులు (AIDS Cases) విజృంభించినట్లు చెబుతున్నారు.
దిద్దుబాటు చర్యలు:
జిల్లాలో ఎయిడ్స్ కేసులు (HIV Cases) తీవ్రమవుతుండడంపై కథనాలు రావడంతో ప్రభుత్వ వైద్యశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఏఆర్టీ సెంటర్ ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తోంది. వైద్య బృందాలు పల్లెల్లో హెచ్ఐవీ కేసుల గుర్తింపునకు శిబిరాలు నిర్వహిస్తోంది. మరోవైపు సరైన చర్యలు తీసుకోకపోతే పొరుగు జిల్లాలకు తద్వారా రాష్ట్రమంతా ఎయిడ్స్ వ్యాప్తి చెందే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఎలా? రిస్క్ ఏంటి?
Follow Us On: Instagram


